మాట తీరు మార్చుకోకపోతే యాక్షన్ తీస్కుంటం.. ఈసీకి కాంగ్రెస్ పార్టీ వార్నింగ్​ లేఖ

మాట తీరు మార్చుకోకపోతే  యాక్షన్  తీస్కుంటం.. ఈసీకి  కాంగ్రెస్  పార్టీ  వార్నింగ్​  లేఖ

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తరుచూ కాంగ్రెస్‌‌, పార్టీ నేతలను టార్గెట్‌‌ చేసుకొని దాడి చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఇలాంటి కామెంట్లే కొనసాగిస్తే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. హర్యానా ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయంటూ రిజల్ట్స్ రోజే సీఈసీకి కాంగ్రెస్ లేఖ రాసింది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఘాటుగా రిప్లై ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తాజా స్పందించింది. 

తొమ్మిది మంది సీనియర్లు సంతకం చేస్తూ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్‎కు లేఖ రాసింది. ‘‘తన స్వతంత్రను సీఈసీ పూర్తిగా పక్కనపెట్టేసింది. ఎన్నికల సంఘం తనకు తాను క్లీన్‌‌చిట్‌‌ ఇచ్చుకోవడం తమనేమీ ఆశ్చర్యపర్చలేదు. హర్యానా ఎన్నికల ఫలితాలపై అనుమానాలున్నాయని లేఖ రాస్తే.. సీఈసీ రిప్లై ఇచ్చిన తీరు ఎంతో బాధకలిగించింది. సీఈసీ వాడిన భాష, కాంగ్రెస్‎పై చేసిన ఆరోపణలే.. మేము మళ్లీ లేఖ రాసేందుకు కారణమైంది. సీఈసీ తన మాటతీరు మార్చుకోవాలి. 

లేదంటే మేము లీగల్‎గా వెళ్లాల్సి ఉంటది. అభ్యంతరకరమైన కామెంట్లను తొలగించేందుకు కోర్టును ఆశ్రయించాల్సి ఉంటది’’ అని లేఖలో కాంగ్రెస్ హెచ్చరించింది. సమస్యలు తెలియజేసేందుకు మాత్రమే సీఈసీకి ఫిర్యాదు చేశామని, అంతేగానీ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌‌, ఈసీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాదని కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికలు, ఫలితాలపై లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడం ఈసీ బాధ్యత అని, దాన్ని మరిచిపోయినట్లు అనిపిస్తున్నదని తెలిపింది.