
హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ రెండు రోజుల కీలక సమావేశాలు అహ్మదాబాద్‌లో బుధవారంతో ముగియడంతో.. ఇక పీసీసీ కార్యవర్గం ప్రకటనపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు అహ్మదాబాద్ సమావేశాల తర్వాతే అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చిన నేతలు, ఇక ఏ అడ్డంకులు ఉండవని చెప్తున్నారు. ఈ నెల 15లోపు పీసీసీ కార్యవర్గం ప్రకటన ఉంటుందని గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లు, 20 మంది ఉపాధ్యక్షులతో పాటు ట్రెజరర్ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. ఇక కార్యవర్గంలోని ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల పోస్టులను ఆ తర్వాతే ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
పీసీసీ కార్యవర్గం ప్రకటించే సమయంలోనే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్‌ను నియమించడంతో ఇది పెండింగ్‌లో పడింది. అయితే ఇప్పుడు ఆమె ఈ జాబితాను మరోసారి పరిశీలించి కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఫైనల్ చేసినట్లు సమాచారం. పార్టీలో పదేండ్లుగా కొనసాగుతున్న వారికే ప్రాధాన్యత ఉంటుందని ఆమె ఇప్పటికే ప్రకటించడంతో పదవులు వరించేది ఎవరికో అనే చర్చ కాంగ్రెస్ నేతల్లో సాగుతున్నది.
ప్రతిపక్షాల విమర్శలను బలంగా తిప్పికొట్టగల నేతలనే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమిస్తామని, అందుకే ఈ పదవుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే అవకాశం ఇస్తామని ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రకటించారు. పది ఉమ్మడి జిల్లాలు ఉండగా.. ప్రతి జిల్లా నుంచి ఇద్దరికి ఉపాధ్యక్షులుగా అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.