జోడో యాత్రలో మరోసారి బయట పడ్డ విభేదాలు

  • నియోజకవర్గ టికెట్​పై హాట్​ టాఫిక్​గా మారిన రేవంత్ ​కామెంట్స్​ 
  • అనుకూలంగా భావిస్తున్న సుభాష్​రెడ్డి వర్గం
  • పీసీసీ చీఫ్, షబ్బీర్​ అలీపై మదన్ ​మోహన్​  ఫైర్​

కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్​ పార్టీకి  పట్టున్న  ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లీడర్ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. హాత్​సే హాత్​జోడో యాత్రలో భాగంగా రేవంత్​రెడ్డి పాదయాత్రలో లీడర్ల తోపులాటలతో రచ్చకెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కలిసి కట్టుగా ముందుకెళ్లాల్సిన  సమయంలో లీడర్లు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తుండడంతో క్యాడర్​లో అయోమయం నెలకొంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో పోటీ చేసే క్యాండిడేట్, నియోజకవర్గ ఇన్​చార్జి విషయంలో  పీసీసీ  చీఫ్​కామెంట్స్​ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. రేవంత్​రెడ్డి వ్యాఖ్యలతో పీసీసీ జనరల్ సెక్రెటరీ వడ్డేపల్లి సుభాష్​రెడ్డి వర్గం తమకు అనుకూలంగా భావిస్తుంటే.. పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​కె.  మదన్​మోహన్​వర్గం ఈ  వ్యాఖ్యలను తప్పు బడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజక వర్గాల్లో కాంగ్రెస్​పార్టీ దక్కించుకున్న ఒకే ఒక సీటు ‘ఎల్లారెడ్డి’. జిల్లాల్లో పార్టీ సీనియర్లంతా ఓడిపోగా.. ఎల్లారెడ్డిలో జాజాల సురేందర్ గెలుపొందారు. అనంతరం బీఆర్ఎస్​లో చేరారు. ​ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ జనరల్​సెక్రటరీ వడ్డేపల్లి సుభాష్​రెడ్డి, వైస్​ ప్రెసిడెంట్​కె. మదన్​మోహన్​రావు ఆసక్తి చూపుతున్నారు. పార్టీలో పట్టు సాధించేందుకు వీరిద్దరూ నియోజకవర్గంలో వేర్వేరుగా ఆఫీసులు ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. క్యాడర్​ను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. సుభాష్​రెడ్డి పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డికి ముఖ్య అనుచరుడు కాగా, మదన్​మోహన్​రావు తనకు రాహుల్​గాంధీ టీమ్​తో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. సుభాష్​రెడ్డి రేవంత్​రెడ్డితో పాటు మాజీ మంత్రి షబ్బీర్​అలీని నమ్ముకొని ఉన్నారు. మదన్​మోహన్​రావు షబ్బీర్​అలీతో విభేదించి నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో మదన్​మోహన్​రావు జహీరాబాద్​ఎంపీగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. సుభాష్​రెడ్డికి గతంలో ఎల్లారెడ్డి టికెట్​చేయిదాకా వచ్చి  బీసీ ఈక్వేషన్​లో చేజారిపోయింది.  ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ తనకే టికెట్​ఇస్తుందనే భరోసాతో ఉన్నారు. 

 నిరుద్యోగ నిరసన దీక్షలో..

జిల్లాలో హాత్​సే హాత్​జోడో యాత్రలో భాగంగా ఈ నెల 19న గాంధారి మండల కేంద్రంలో  రేవంత్​రెడ్డి నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. రేవంత్​రెడ్డి బస చేసిన చోట  మదన్​మోహన్​, సుభాష్​రెడ్డి వర్గాల మధ్య తోపులాట జరిగింది. క్యాంపులోకి సుభాష్​రెడ్డి వెళ్లిన కొద్ది సేపటికి మదన్​మోహన్​రావు వచ్చారు. ఆయనతో పాటు  అనుచరులు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని సెక్యూరిటీ ఆపడంతో వాదనకు దిగారు. అనంతరం ఇద్దరు లీడర్ల అనుచరులు తోపులాడుకున్నారు. ఏడాది కింద కూడా ఎల్లారెడ్డిలో పార్టీ నిర్వహించిన ‘మన ఊరు–మన పోరు’ సభలో ఇరు వర్గాలు గొడవకు దిగాయి.

రేవంత్​రెడ్డి వ్యాఖ్యలతో..

గాంధారి మీటింగ్​లో ‘ఎల్లారెడ్డి’ టికెట్​కేటాయింపు విషయంలో రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ‘2018 ఎన్నికల్లో ఎల్లారెడ్డి టికెట్​సుభాష్​రెడ్డికి ఇవ్వాలని హైకమాండ్​వద్ద నేను పట్టబట్టాను. మాజీ మంత్రి షబ్బీర్​అలీ జాజాల  సురేందర్​కు ఇవ్వాలని సిఫారసు చేశారు. సీనియర్​లీడర్​గా ఆయన మాటలనే పరిగణలోకి తీసుకున్న హైకమాండ్​సురేందర్​కు టికెట్​ఇచ్చింది.’ అని రేవంత్​రెడ్డి  చెప్పారు. ఈ సారి  షబ్బీర్​అలీ  ఎవరిని సూచిస్తే వాళ్లకు  టికెట్​ఇస్తామని  సుభాష్​రెడ్డికి టికెట్​వస్తుందనే విషయాన్ని  పరోక్షంగా రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.  ఈ ప్రకటనపై మదన్​మోహన్​రావు మండిపడ్డారు.  సోమవారం జిల్లా కేంద్రంలో  మదన్​మోహన్​రావు ప్రెస్​ మీట్​పెట్టి షబ్బీర్​అలీపై విమర్శలు చేశారు.  తనకు ఏఐసీసీ ఫైనల్​అని  స్పష్టం చేశారు.  ఈ అంశాన్ని హైకమాండ్​చెప్పనున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు.