- మండల కమిటీ నియామకాల్లో గొడవలు.. నారజ్లో జూనియర్ లీడర్లు
- ఠాక్రేను కలిసి ఫిర్యాదు చేసిన రేవంత్, కోమటిరెడ్డి వర్గాలు
నల్గొండ, వెలుగు: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ జూనియర్ లీడర్లు కలవరపడుతున్నారు. అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయన్న నమ్మకంతో నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నా అవమానాలు ఎదుర్కోక తప్పడం లేదని నారాజ్ అవుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత సర్వేలు కొంత వరకు గట్టెక్కెస్తాయనే నమ్మకం ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులు వచ్చే సరికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని టికెట్ఆశిస్తున్న జూనియర్లు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మండల కమిటీ నియామకాల్లో జరుగుతున్న గొడవలు ఈ లీడర్లను మరింత కలవరపాటుకు గురిచేస్తున్నాయి.
కమిటీలతో కొత్త చిచ్చు!
మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో తాజాగా పార్టీ నియమించిన మండల కమిటీలు కొత్త చిచ్చురేపాయి. రేవంత్వర్గీయుడైన చల్లమల్ల కృష్ణారెడ్డి ప్రతిపాదించిన వారినే మండల పార్టీ అధ్యక్షులుగా నియమించారు. దీంతో పాల్వాయి స్రవంతి, పున్నా కైలాష్ నేత తదితరులు ఈ కమిటీల ఏర్పాటును వ్యతిరేకించారు. ఈ విషయమై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన స్రవంతి దీనిపై పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేను కలిసి ఫిర్యాదు చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలోనూ ఇదేరకమైన పంచాయితీ నెలకొంది. నకిరేకల్ టౌన్, రూరల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి మండల ప్రెసిడెంట్లుగా జానారెడ్డి వర్గానికి చెందిన కొండేటి మల్లయ్య చెప్పిన వ్యక్తులనే నియమిస్తూ జిల్లా పార్టీ ప్రెసిడెంట్శంకర్నాయక్ రెండు రోజుల కింద నియామక పత్రాలు అందజేశారు. కొండేటి మల్లయ్య బుధవారం నాలుగు మండలాల అధ్యక్షులను అధికారికంగా ప్రకటించారు. అదే రోజు రాత్రి 10.30 గంటలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ నియామకాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ నకిరేకల్‌లో పాత కమిటీలనే కొనసాగిస్తున్నట్టు గాంధీభవన్ నుంచి ప్రెస్‌నోట్ రీలీ జ్ చేశారు. కానీ అప్పటికే కొత్త మండల అధ్యక్షుల ప్రకటన జరిగిపోవడంతో నకిరేకల్పార్టీలో గొడవలు మొదలయ్యాయి. పార్టీ లాయలిస్టులలను కాదని మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలుపుకోసం పనిచేసిన వారినే తిరిగి కొనసాగించేందుకు పార్టీ సీనియర్లు కుట్ర పన్నుతున్నారని మల్లయ్య వర్గం ఆరోపిస్తోంది.
మిర్యాలగూడ, సూర్యాపేటలో అదే లొల్లి..
మిర్యాలగూడ, సూర్యాపేట నియోజకవర్గాల్లోనూ అదే లొల్లి జరుగుతోంది. జిల్లా పార్టీ అధ్యక్షుల నియా మకం జరిగి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జిల్లా కమిటీ పూర్తిస్థాయిలో ఏర్పడలేదు. ఇంకోవైపు మండల కమిటీలు మారుద్దామని ప్రయత్నిస్తుంటే పార్టీలో గొడవలు జరుగుతున్నాయి. మిర్యాలగూడలో కాంగ్రెస్ సీనియర్‌నేత జానారెడ్డి వర్గం, బత్తుల లక్ష్మారెడ్డి వర్గాల మధ్య పోటీ నడుస్తోంది. పైగా జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ ఇదే నియోజకవర్గం కావ డంతో తన పట్టు నిలుపుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. జానారెడ్డిని కాదని ఇక్కడ కొత్త అధ్యక్షులను నియమించే పరిస్థితి కనిపించడం లేదు. సూర్యాపేటలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పటేల్‌రమేశ్‌రెడ్డి వర్గీయులకు అస్సలు పడటం లేదు. దీంతోనే ఇప్పటి వరకు ఈ జిల్లా పార్టీ ప్రెసిడెంట్‌ను కూడా ప్రకటించలేదు. చెవిటి వెంకన్న యాదవ్ ఇంకా కొనసాగుతున్నారు. రేవంత్ వర్గానికి చెందిన రమేశ్‌రెడ్డి తన బలాన్ని చాటుకునేందుకు జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక నల్గొండలో కమిటీల ప్రస్తావనే లేకుండా పోయింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఇక్కడ కమిటీల వ్యవహారంలో ఎవరూ తలదూర్చే పరిస్థితులు కనిపించడం లేదు.
రేవంత్ సర్వే కలిసొచ్చేనా?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లను సర్వేల ద్వారా డిసైడ్ చేస్తామని అధిష్టానం చెబుతోంది. ఈమేరకు పార్టీ హైకమాండ్ ఓ సర్వే చేయిస్తుండగా, రేవంత్ రెడ్డి సొంతంగా మరో సర్వే చేయిస్తున్నారు. దీంతో రేవంత్ సర్వే పైన ఆయన వర్గీయులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. సీనియర్లకు ఎదుర్కొనేందుకు రేవంత్ సర్వే తమకు కలిసి వస్తోందని భావిస్తున్నారు. తాజాగా మండల కమిటీ అధ్యక్షుల నియామక బాధ్యతలు తమకే అప్పగించడంతో రేవంత్ వర్గానికి తిరుగు ఉండదనే భావించారు. కానీ సీనియర్లు అడ్డుతగలడంతో ఇప్పుడు పార్టీ సర్వే సంగతి ఎట్లున్నా రేవంత్ సర్వే పైన పెట్టుకున్న ఆశలు ఆవిరి ఆవుతాయోమోనని ఆందోళన చెందుతున్నారు.