హర్యానా.. కాంగ్రెస్​ హైరానా!

హర్యానాలోని కాంగ్రెస్ పార్టీ​లో అసెంబ్లీ ఎన్నికల ముంగిట గొడవలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇక్కడ 2014లో పవర్​​ కోల్పోయిన ఈ గ్రాండ్​ ఓల్డ్​ పార్టీ​కి ఐదేళ్ల తర్వాత కూడా ‘హస్త’వాసి మారేట్లు కనిపించట్లేదనేది ఎనలిస్టుల టాక్​. హర్యానాలో కాంగ్రెస్​ పార్టీ కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. హైకమాండ్​ సోనియాగాంధీ స్టేట్​ కాంగ్రెస్​కి ఈమధ్య రిపేర్​ చేసినా గాడినపడేట్లు లేదు. ఒకపక్క అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్​డౌన్​ మొదలైంది.  ఈ గందరగోళానికి రీసెంట్​గా టికెట్ల లొల్లి తోడైంది. తమ సపోర్టర్లకు పోటీ చేసే​ ఛాన్స్​ ఇవ్వకపోవటంతో సీనియర్ నేతలు ఓపెన్​గానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ మాజీ చీఫ్​ అశోక్​ తన్వర్​ ఏకంగా ఢిల్లీలోని సోనియాగాంధీ ఇంటి వద్ద నిరసనకు దిగటం పార్టీలో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ తర్వాత ఆయన పార్టీకి రాజీనామా చేసేశారు.  పార్టీ ‘హుడా కాంగ్రెస్​’గా మారిందని ఆరోపించారు.  ఈ ఘటన తర్వాత టికెట్ల కేటాయింపుపై హైకమాండ్​కూడా సీరియస్​ అయింది. కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ సోనియాగాంధీకి గతంలో పొలిటికల్​ సెక్రెటరీగా పనిచేసిన అహ్మద్​ పటేల్​.. హర్యానాలో టికెట్ల కేటాయింపు జరిగిన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది.

సీనియర్లకు కాస్త ఊరట

హర్యానా శాసన సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను ఆరుగురు సభ్యుల కమిటీకి అప్పగించారు. అందులో స్క్రీనింగ్​ కమిటీ మెంబర్​, మాజీ సీఎం భూపిందర్​సింగ్​ హుడా ఒకరు. టికెట్ల పంపకంలో పార్టీలోని సీనియర్లందరికీ సమాన అవకాశం ఇవ్వలేదనే కంప్లయింట్లు హైకమాండ్​కి పెద్దఎత్తున అందాయి. ఈ నేపథ్యంలో హుడాతోపాటు హర్యానా పార్టీ వ్యవహారాల ఇన్​చార్జ్​ గులాం నబీ ఆజాద్​ని కూడా అహ్మద్​ పటేల్ గట్టిగానే ప్రశ్నించినట్లు ఆ వీడియోలో క్లియర్​గా కనిపిస్తోంది.

‘కైథాల్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే, పార్టీ చీఫ్​ స్పోక్స్​ పర్సన్​ రణ్​దీప్​సింగ్​ సూర్జివాలా కోటాలో ఎందరికి టికెట్లు ఇచ్చారు?’ అని అహ్మద్​ పటేల్​ అడగ్గా, వాళ్లిద్దరూ వేర్వేరు జవాబులు చెప్పారు. నలుగురికి ఇచ్చామని హుడా, ఆరుగురికి ఇచ్చామని ఆజాద్​ అన్నారు. ఈ వీడియోపై పార్టీ వర్గాలు అఫీషియల్​గా స్పందించలేదు. అయితే టికెట్ల పంపిణీ సరిగా జరగకపోవటంపై బాధ్యుల నుంచి టాప్​ లీడర్​షిప్​​ వివరణ కోరటం రాష్ట్రంలో సీనియర్లకు సంతృప్తి కలిగించింది. తమ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవటంతో వాళ్లు కొంచెం శాంతించారు. అలాగని, పూర్తిగా ఫ్రెండ్లీ కల్చర్​ ఏర్పడిందని చెప్పలేం.

స్టేట్​ లీడర్ల కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు హైకమాండ్​కు తెలిసినా సకాలంలో స్పందించలేదని, దీంతో భవిష్యత్​లో పార్టీ పరిస్థితి మరింత క్షీణించనుందని ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని​ లెజిస్లేటివ్​ పార్టీ మాజీ చీఫ్ కిరణ్​ చౌధురి ఈమధ్య అహ్మద్​ పటేల్​ని కలిసి చెప్పారు. పనిలోపనిగా టికెట్ల పంపిణీలో తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో అహ్మద్​ పటేల్​ అలర్ట్​ అయ్యారు.  కిరణ్​ చౌధురి తర్వాత భూపిందర్​సింగ్​ హుడా, అశోక్​ తన్వర్​లతో కూడా భేటీ అయ్యారు. టికెట్ల గొడవకు ఫుల్​ స్టాప్​ పెట్టడానికి తన వంతు ప్రయత్నాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఢీకొట్టేలా కాంగ్రెస్​ పార్టీ ముందుజాగ్రత్త తీసుకోలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోయిందని పరిశీలకులు అంటున్నారు.

ఎక్కువ మంది తెలిసినోళ్లే
మొత్తం 90 సీట్లకు కాంగ్రెస్​ ప్రకటించిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది పాతవాళ్లు, సీనియర్​ లీడర్ల వారసులు ఉన్నారు. వేరే పార్టీల నుంచి వచ్చిన కొందరికీ టికెట్లు దక్కాయి. 15 మంది సిట్టింగ్​లకు ఈసారీ ఛాన్స్​ ఇచ్చారు. స్క్రీనింగ్​ కమిటీ మెంబర్​ భూపిందర్​సింగ్​ హుడా తన కంచుకోటయిన గర్హి సంప్లా కిలోయి సెగ్మెంట్​లోనే మళ్లీ బరిలో నిలుస్తున్నారు.