ఎమ్మెల్యేలకే డీసీసీ చీఫ్ పదవులు.. ఎమ్మెల్యేలు లేని జిల్లాల్లో మాజీలకు బాధ్యతలు

ఎమ్మెల్యేలకే డీసీసీ చీఫ్ పదవులు.. ఎమ్మెల్యేలు లేని జిల్లాల్లో మాజీలకు బాధ్యతలు
  • హైకమాండ్​ ఆదేశాలతో పీసీసీ కసరత్తు 
  • లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్​ అడుగులు 

హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని భావిస్తున్న కాంగ్రెస్..​ అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతోంది. వరుసగా పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు రానుండడంతో జిల్లా స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామకంపై పీసీసీ చీఫ్  మహేశ్ కుమార్ గౌడ్ కసరత్తు ప్రారంభించారు. ఈ నెలాఖరులోపు డీసీసీలను ప్రకటించే అవకాశమున్నందున ఇప్పటికే ఆయా జిల్లాల మంత్రులు, ఇన్​చార్జ్​ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు. 

లోకల్​బాడీ ఎన్నికల్లో క్యాడర్​ను నడిపించాలంటే బలమైన నేతలు డీసీసీ అధ్యక్షులుగా ఉండాలని పీసీసీ చీఫ్​కు హైకమాండ్ కూడా సూచించింది. ఎమ్మెల్యేలే పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉంటే పార్టీకి మంచి ఊపు వస్తుందన్నది ఢిల్లీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. ఈమేరకు జిల్లాల్లో ఎమ్మెల్యేలకే పార్టీ పగ్గాలు ఇవ్వాలనే నిర్ణయానికి పీసీసీ వచ్చింది. ఎమ్మెల్యేలు లేని చోట ఎమ్మెల్సీలకో, మాజీ ఎమ్మెల్యేలకో పగ్గాలు కట్టబెట్టాలని భావిస్తోంది.

కొన్ని జిల్లాల్లో సమస్యలు..

కొన్ని జిల్లాల్లో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రావడంలేదని చర్చ జరుగుతోంది. ఇంకొన్ని జిల్లాల్లో ఇతర సమస్యలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. సిరిసిల్ల నియోజకవర్గం బీఆర్ఎస్  చేతిలో ఉండగా, వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా ఉన్నారు. దీంతో ఆ జిల్లాలో పార్టీ అధ్యక్ష పదవి మాజీ ఎమ్మెల్యేకో, లేదంటే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేతకో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అలాగే, జనగామ జిల్లాలో జనగామ అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటే ఉంది. జనగామను ఆనుకొని ఉన్న ఇతర నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలు మాత్రమే ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. కానీ, జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ ఎమ్మెల్యే లేరు. దీంతో ఆ జిల్లాలోనూ డీసీసీ చీఫ్ పదవి ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకో, పార్టీ సీనియర్ నేతకో ఇవ్వాలని భావిస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి.. లేదంటే రాష్ట్రస్థాయిలో కీలక కార్పొరేషన్ పదవులపై కన్నేశారు.

 ఇలాంటివాళ్లు డీసీసీ చీఫ్ బాధ్యతలు తమకు వద్దని ఇటు సీఎం రేవంత్ కు, అటు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కు, పార్టీ ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షీకి రెక్వెస్టులు పెట్టుకుంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి అనుకున్న ఫలితాలు రాకుంటే డీసీసీ చీఫ్ గా తమను బాధ్యులను చేస్తారని, భవిష్యత్​లో తమకు ఇతర ఏ పదవులు దక్కే అవకాశం ఉండదని పలువురు ఎమ్మెల్యేలు ఈ బాధ్యతలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే, ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ నిర్ణయం శిరసావహించాల్సిందేనని పీసీసీ నాయకత్వం తేల్చి చెప్తుండడంతో కొందరు ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు. మెజార్టీ జిల్లాల్లో మాత్రం పార్టీ ఎమ్మెల్యేలకే డీసీసీ చీఫ్ పదవులు ఇచ్చేనిర్ణయం జరిగిపోయిందని, ఈ నెలాఖరులోగా ప్రకటన వెలువడడమే తరువాయి అని గాంధీ భవన్ లో ప్రచారం సాగుతోంది.