వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ డిప్యూటీ మేయర్‍పై అవిశ్వాసానికి అధికార కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు రెడీ అవుతున్నారు. ఇదే అంశమై కొన్ని రోజులుగా తెరవెనక రాజకీయాలు నడుస్తున్నాయి. అదేసమయంలో హస్తం పార్టీ నుంచి డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం ఫుల్ కాంపిటీషన్ నడుస్తోంది. గ్రేటర్ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల నుంచి ప్రధానంగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఈ పదవి కోసం ఆశతో ఉన్నారు. ఎవరికివారుగా ఇద్దరు తమ ప్రాంత ఎమ్మెల్యేలను నమ్ముకుని ముందుకెళ్తున్నారు. దీంతో చాలా రోజుల తర్వాత గ్రేటర్ వరంగల్లో ఓవైపు అవిశ్వాసం మరోవైపు కొత్త డిప్యూటీ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మేయర్ కాంగ్రెస్.. డిప్యూటీ మేయర్ బీఆర్‍ఎస్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‍లో మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో ఉండగా, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ 36వ డివిజన్ కార్పొరేటర్‍గా బీఆర్‍ఎస్ పార్టీలో ఉన్నారు. 2021లో గ్రేటర్ పీఠాన్ని బీఆర్‍ఎస్ కైవసం చేసుకోగా, సుధారాణి, షమీమ్ పదవులు దక్కించుకున్నారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే గుండు సుధారాణి హస్తం పార్టీలోకి వచ్చారు. దాంతో అప్పటివరకు మేయర్ పీఠానికి అవిశ్వాసం పెట్టాలని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆపై దానిని విరమించుకుంది.
రజాలీ కోసం నాయిని.., ఫుర్కాన్ కోసం కొండా
ప్రస్తుత డిప్యూటీ మేయర్‍పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గితే, కాంగ్రెస్ నుంచి ఎవరిని డిప్యూటీ పీఠం వరిస్తుందనేదే ఇప్పుడు ప్రధాన చర్చ. ప్రస్తుతం రిజ్వానా షమీమ్ మైనార్టీ సామాజికవర్గం నుంచి ఉన్నారు. మొత్తంగా గ్రేటర్ లో 66 మంది కార్పొరేటర్లలో షమీమ్ కాకుండా మరో ముగ్గురు కార్పొరేటర్లు మైనార్టీలుగా ఉన్నారు. ఇందులో కాజీపేట నుంచి దాదాపు 30 ఏండ్లకుపైగా పార్టీ కోసం పనిచేస్తున్న రజాలీ ఉన్నారు. ఆయన ప్రేమ వివాహం నేపథ్యంలో అతడి భార్య విజయశ్రీ రజాలీ బరిలో నిలిచి 63 డివిజన్ నుంచి కార్పొరేటర్‍గా ఉన్నారు. 48వ డివిజన్ నుంచి సార్తాజ్ బేగం ఉండగా, తూర్పు నియోజకవర్గం 21వ డివిజన్ బీఆర్‍ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మహ్మద్ ఫుర్కాన్ వ్యవహరిస్తున్నారు.
గతంలో జంగా రాఘవరెడ్డి వర్గంలో పనిచేసిన రజాలీ ప్రస్తుతం పశ్చిమలో నాయిని రాజేందర్‍రెడ్డి వెంట నడుస్తున్నారు. ఇక పుర్కాన్ కోసం కొండా దంపతులు ప్రయత్నం చేస్తున్నారు. పోటీపడే ఇద్దరిలో రజాలీ పార్టీలో చాలా సీనియర్ కావడం, బీఆర్‍ఎస్ ప్రభుత్వ హయాంలోనూ గులాబీ నేతల హవాను తట్టుకుని కాజీపేట నుంచి కార్పొరేటర్‍గా వరుసగా గెలుస్తూ రావడం ప్లస్ అయింది.
ఫుర్కాన్ మాత్రం కొండా అనుచరులుగా వారిని నమ్ముకున్నాడు. అయితే రజాలీని బరిలో నుంచి తప్పించడానికి తూర్పు ప్రధాన నేత ఒత్తిడి తీసుకువస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. మొత్తంగా గ్రేటర్ వరంగల్ రాజకీయాల్లో దాదాపు ఏడాదిన్నర తర్వాత రాజకీయాలు వేడెక్కాయి. రిజానా షమీమ్‍పై అవిశ్వాసం.. కొత్త డిప్యూటీ మేయర్ ఎంపిక ఎవరనేదానిపై జనాలు ఆసక్తిగా ఉన్నారు.
'చేతి'లో బలంతో.. అవిశ్వాసానికి సై..
గ్రేటర్ వరంగల్లో 66 మంది కార్పొరేటర్లు ఉండగా, అప్పటి గులాబీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు తప్పించి, అందరూ కాంగ్రెస్ లో చేరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ, పశ్చిమలో నాయిని రాజేందర్‍రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎలాగూ మేయర్ సుధారాణి సైతం కాంగ్రెస్‍లోనే ఉండగా, రెండో ప్రధాన పోస్టుగా భావించే డిప్యూటీ మేయర్ మాత్రం ఇంకా బీఆర్‍ఎస్ ఖాతాలోనే ఉంది.
దీనికితోడు షమీమ్ భర్త మసూద్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అనుచరుడిగా ఉంటూ అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. పాలకవర్గానికి ఇంకా దాదాపు 15 నెలల పవర్ ఉంది. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానానికి అవసరమైన బలం హస్తం పార్టీ చేతిలో ఉండటంతో కొన్ని రోజులుగా అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ముహూర్తం పెట్టడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.