ఖమ్మం జిల్లాలో జేఎన్టీయూ కాలేజీ పేరుతో రూ.200కోట్ల అవినీతి పాల్పడ్డారని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ ఆరోపించారు. ఖమ్మం నియోజకవర్గంలో యథేచ్చగా మట్టి దందా జరుగుతుందని మండిపడ్డారు. 30 ఎకరాల్లో గుట్టను తవ్వి పాలేరులో జేఎన్టీయూ కాలేజీకి అనుమతులా..? అని ప్రశ్నించారు. ఖమ్మం నుండి పాలేరుకు తరలిపోయిన జేఎన్టీయూ కాలేజీ గురించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సరైన సమాధానం ఇవ్వకుంటే రఘునాథపాలెం గుట్టను పరిశీలిస్తాం.. విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందని ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ ధ్వజమెత్తారు. జేఎన్టీయూ కాలేజీ వస్తుందన్న ప్రచారంతో.. రఘునాథపాలెం మండలంలో 30 ఎకరాల్లో గుట్టను తవ్వి రూ. 200కోట్ల విలువైన మట్టిని అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుట్టను తవ్వి, మట్టిని తరలించిన తరువాత జేఎన్టీయూ కాలేజీ పాలేరు నియోజకవర్గానికి తరలిపోయిందని ప్రకటించడం.. పూర్తిగా మోసపూరితమైన విధానమని జావేద్ విమర్శించారు.
బీఆర్‌ఎస్ నేతలు జేఎన్టీయూ కాలేజీ అనుమతులపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందని మహ్మద్ జావేద్ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాకు జేఎన్టీయూ కాలేజీలు రెండా, ఒకటా..? ఒకటయితే గుట్ట మట్టిని తరలించిన దగ్గర ఎందుకు నిర్మాణం చేయడంలేదో వివరించాలని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి, తెలంగాణ వనరులు మనకే వస్తాయని చెప్పి.. తీరా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వనరుల దోపిడీకి తెరలేపిందని మహ్మద్ జావేద్ గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ హయాంలో 27 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు, తప్పుదు విధానాలతో నేడు కేవలం ఏడు కాలేజీలు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందన్నారు. రెండు రోజుల్లో మంత్రి పువ్వాడ సమాధానం ఇవ్వకుంటే ఆందోళనకు దిగేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ హెచ్చరించారు.