జేఎన్టీయూ కాలేజీ వస్తుందంటూ.. రూ.200 కోట్ల మట్టిని అమ్ముకున్నరు

జేఎన్టీయూ కాలేజీ వస్తుందంటూ.. రూ.200 కోట్ల మట్టిని అమ్ముకున్నరు
  • కాలేజీ తరలిపోవడంపై మంత్రి పువ్వాడ సమాధానం చెప్పాలి
  • ఖమ్మం సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహ్మద్ జావీద్ 

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో అవినీతి పెరిగిపోతోందని సిటీ కాంగ్రెస్​అధ్యక్షుడు మహ్మద్ జావీద్ ఆరోపించారు. గురువారం స్థానిక పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. జేఎన్టీయూ కాలేజీ రాబోతుందనే ప్రచారంతో అధికార పార్టీ నాయకులు రఘునాథపాలెం మండలంలో దాదాపు 30 ఎకరాల్లోని మట్టిగుట్టను తవ్వి రూ.200 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

చివరికి కాలేజీ పాలేరుకు తరలిపోయిందన్నారు. పక్కా ప్లాన్​ప్రకారమే మట్టి గుట్టను దోచుకున్నారని, ఖమ్మం నియోజకవర్గంలో ఏర్పాటు చేయాల్సిన కాలేజీని పాలేరుకు తరలించడంపై మంత్రి పువ్వాడ అజయ్ సమాధానం చెప్పాలన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్​ఆధ్వర్యంలో కమిటీ వేసి కాలేజీకి కేటాయించిన స్థలంలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. అవసరమైతే స్థానిక స్టూడెంట్లతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు, దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లకావత్‌ సైదులు నాయక్‌, జిల్లా మైనారిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముజాహిద్‌ హుస్సేన్‌, సేవాదళ్‌ అధ్యక్షుడు గౌస్‌, జనరల్‌సెక్రెటరీ రబ్బాని తదితరులు పాల్గొన్నారు.