కాంగ్రెస్ పార్టీకి ఆశ ఇతడే!

కాంగ్రెస్ పార్టీకి ఆశ ఇతడే!

తొలిరోజుల్లో పాలిటిక్స్ పై బాగా నాన్ సీరియస్ గా ఉండే రాహుల్​ మూడేళ్ల కిందట ఓసారి ఎక్కడికో తెలీదు కానీ  లాంగ్ టూర్ కు వెళ్లి  వచ్చాడు. ఆ తర్వాత నుంచి రాహుల్ లో మార్పు కనిపించింది. వద్దనుకున్న పాలిటిక్స్ పై ఆయన ఆసక్తి పెంచుకున్నట్లు కనిపించింది. రాజకీయ యుద్ధం చేయక తప్పదని డిసైడ్ అయినట్లున్నారు. అందుకు తగ్గట్లుగా బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. పార్టీ లీడర్లతో, కార్యకర్తలతో మాట్లాడే పద్దతి మారిపోయింది. రాహుల్ తనను తాను మార్చుకోవడం మొదలెట్టారు. 2004 లో రాహుల్ తొలి సారి లోక్ సభలోకి ప్రవేశించారు. అప్పుడు, చాలా తక్కువ సార్లు ఆయన సభలో మాట్లాడారు. ఏళ్లు గడిచేకొద్దీ ఆయన లో మార్పు వచ్చింది.ఇప్పుడు ధాటిగా మాట్లాడుతున్నారు. మాటకు మాట అంటున్నారు. మాటలనే తూటాల్లా వదులుతున్నారు. రాఫెల్ వంటి కీలక అంశాలపై  ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే ఇరుకున పెట్టేస్తున్నారు. బదులివ్వండంటూ సూటిగా ప్రశ్నలను సంధిస్తున్నారు. అవసరమైన చోట్ల మెట్టు దిగుతున్నారు. సవాళ్లను స్వీకరించడం, వాటిని అధిగమించడానికి చేసిన ప్రయత్నాలతో మెల్లమెల్లగా తన పై ఉన్న నాన్ సీరియస్ ఇమేజ్ ను రాహుల్  చెరిపేసుకున్నారు.

గుజరాత్ లో బీజేపీని కట్టడిచేసిన నేత 

రెండేళ్ల కిందట గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు కళ్లెం వేసి రాహుల్ తొలిసారి తన నాయకత్వ లక్షణాలను  ప్రదర్శించారు. బీజేపీ వంద సీట్లు దాటకుండా కట్టడి చేశారు. ఆ తర్వాత కర్ణాటకలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా, ఆ పార్టీకి అధికారం దక్కకుండా చేయడంలో కూడా చాకచక్యం చూపించారు. రాజకీయాల్లో పట్టువిడుపులు ఎంత ముఖ్యమో రాహుల్ బాగా అర్థం చేసుకున్నారు. కర్ణాటకలో  సింగిల్ లార్జెస్ట్ పార్టీగా  బీజేపీ అవతరించినా కమలనాధులను అధికారంలోకి రానివ్వకుండా కట్టడి చేయడానికి  ప్రాంతీయ పార్టీ జేడీ (ఎస్) కు సీఎం కుర్చీ ఇవ్వడానికి కూడా వెనకాడలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ కు ఉన్న ఇమేజ్ వేరు. తరువాత వచ్చిన ఇమేజ్ పూర్తిగా డిఫరెంట్.

మూడు రాష్ట్రాల్లో విజయంతో సత్తా చాటిన లీడర్

కిందటేడాది చివరిలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవడంతో రాహుల్ గాంధీ రాజకీయవర్గాల్లో ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. గతంలో రాహుల్ ఎక్కడ ప్రచారం చేసినా, అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందన్న  అపవాదు బలంగా ఉండేది. ఫలితాలు కూడా అలాగే రావడంతో రాహుల్ నాయకత్వ లక్షణాలపై చాలా మందిలో అనుమానాలు ఉండేవి. మూడు హిందీ  రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుతో  దీని నుంచి బయటపడి రాహుల్ ఒక లీడర్ గా ఎదిగారు. ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ప్రజలు నమ్మడం మొదలెట్టారు. సమాజంలో మార్పు యువతరంతోనే సాధ్యమన్నది రాహుల్ నమ్మకం. అందుకే పార్టీ లో కీలక పదవులన్నిటినీ  యూత్ తో నింపేయాలని ఆయన ఆశించినట్లు రాజకీయ పండితుల సమాచారం.  అయితే  పార్టీలో ఉన్న  కొన్ని  పరిస్థితుల దృష్ట్యా  సీనియర్లను కూడా పదవుల్లో అకామడేట్ చేయక తప్పలేదంటారు పొలిటికల్ ఎనలిస్టులు. ఇలా ఓల్డ్ అండ్ యంగ్ మధ్య జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తుంటారు  రాహుల్. ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ విదేశీ వ్యవహారాల వంటి కొన్ని కీలక అంశాలపై ఆయనకున్న  అభిప్రాయాలు ఏ రోజూ బయటపడలేదంటారు రాజకీయ విశ్లేషకులు. ఎక్కడకు వెళ్లినా  స్టూడెంట్స్ తో  పాటు వివిధ ప్రొఫెషనల్ గ్రూప్స్  ఇంటరాక్ట్ అవుతుంటారు. తన ఆలోచనలను ఆయన వారితో పంచుకుంటారు.

పొత్తుల విషయంలో చొరవ చూపలేదన్న విమర్శలు

ప్రధాన రాజకీయ ప్రత్యర్థి బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో పొత్తులు పెట్టుకునే విషయంలో రాహుల్ చొరవ చూపరన్న విమర్శ ఉంది. మొదటి నుంచి బీజేపీతో యుద్దం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీ, హర్యానాల్లో  కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోవడాన్ని  ఓ పొరపాటుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు  రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయి చివరకు కమలనాధులు గెలవడానికి పరోక్షంగా రాహుల్ అవకాశం కల్పిస్తున్నారన్న  విమర్శలు వస్తున్నాయి.

నేను సైతం..

ముల్లును ముల్లుతోనే తీయాలని రాహుల్ డిసైడ్ అయినట్లున్నాడు. ఏ హిందూత్వ ఐడియాలజీ ఆధారంగా బీజేపీ జనంలోకి  చొచ్చుకుపోతోందో అదే హిందూత్వను రాహుల్ ఆయుధంగా మలచుకున్నాడు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తొలిసారిగా  గుళ్లు, గోపురాలను దర్శించడం మొదలెట్టాడు. మఠాల సందర్శతోనే  కాకుండా 12 రోజుల పాటు కైలాస మానస సరోవర్ యాత్ర కూడా చేయడం గమనించాలి. సగటు హిందువుగా, శివభక్తుడిగా ప్రజల్లో తనకంటూ ఓ కొత్త ఇమేజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం వెనక హిందూత్వ పై బీజేపీకి  ఎలాంటి పేటెంట్ హక్కులు లేవని చెప్పడమే రాహుల్ ఉద్దేశంగా కనిపిస్తోంది.

కలిసొచ్చినవి

రాహుల్​ గాంధీకి నెహ్రూ కుటుంబ వారసత్వం  ఉన్నా చాలా సింపుల్‌‌గా ఉంటారు. గ్రాండ్​ ఓల్డ్​ పార్టీకి యంగ్​ ప్రెసిడెంట్​​ అయ్యారు. ఆ గర్వం, దర్పం  రాహుల్‌‌లో లేకపోవటం ఆయనకు కలిసొచ్చే అంశం. ‘కాబోయే ప్రధాని’గా ప్రచారం చేసుకోవటానికి పెద్దగా ఇష్టపడరు. ఎవరు చెప్పినా వినాలనుకుంటారు. అన్నీ నాకే తెలుసునని అనుకోరు. రొటీన్‌‌ పొలిటీషియన్‌‌లా హంగామా చేయరు. కాంగ్రెస్‌‌ లీడర్లపై ఉండే అవినీతి మచ్చలేవీ లేవు. కనీసం ఆయన వ్యక్తిగత జీవితంలోసైతం ఎక్కడా వేలెత్తి చూపే ఘటనలు లేవు. వయసు 50 దగ్గరకొచ్చినా పక్కింటి అబ్బాయిలా సౌమ్యంగా కనిపిస్తారు. కాంగ్రెస్‌‌ లీడర్లపై ఉండే అవినీతి మచ్చలేవీ లేవు. కనీసం ఆయన వ్యక్తిగత జీవితంలోసైతం ఎక్కడా వేలెత్తి చూపే ఘటనలు లేవు. వయసు 50 దగ్గరకొచ్చినా పక్కింటి అబ్బాయిలా సౌమ్యంగా కనిపిస్తారు.

పుట్టుకతోనే గోల్డ్‌‌ స్పూన్‌‌ బేబీ అయినా పేదలపట్ల చాలా ప్రేమగా ఉంటారు. జనరల్‌‌గా ఎక్కడికైనా వెళ్లినప్పుడు అక్కడి జనంతో కలిసిపోతారు. ప్రచారానికి చాలా దూరంగా ఉంటారు. రాఫెల్‌‌ విషయంలో మోడీని కార్నర్‌‌ చేయగలిగారు. దేశంలో రాఫెల్‌‌ డీల్‌‌పై చర్చ జరిగేలా ఇష్యూని సమర్థవంతంగా నడిపించారు.  పార్లమెంట్‌‌లోసైతం మిగతా ప్రతిపక్షాలతో డిబేట్‌‌ చేయించారు.

కలిసిరానివి

పాలిటిక్స్‌‌పై పెద్దగా ఇంట్రస్ట్​ చూపకపోవటంతో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే పాతుకుపోయిన సూపర్‌‌ సీనియర్లను కదిలించలేక పోయారు.​.సొంతంగా తనకంటూ ఎలాంటి సిద్ధాంతాలు ఉన్నట్లు కనిపించరు. తండ్రి రాజీవ్‌‌ గాంధీలా దేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనకూడా ఎక్కడా కనబడదు. విజన్​ ఉన్న నేతగా ఎవరికీ అనిపించరు. ప్రధాని మోడీలా వక్త కాదు. గొంతు గంభీరంగా అనిపించదు. ఎత్తుకున్న అంశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లలేరు. వివిధ విషయాలపై లోతైన అవగాహన కూడా సాధించలేకపోయారు. పొత్తుల విషయంలో చాలా స్లోగా స్పందించారు. దేశమంతా రాజకీయ వాతావరణం వేడెక్కినప్పుడు సైతం చిన్నపార్టీలను కలుపుకుని వెళ్లడంలో ఫెయిలయ్యారు. కేవలం యాంటీ–బీజేపీ స్టాండ్‌‌పైనే ఆధారపడ్డారు. పార్టీ పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్నా తనకంటూ సొంత టీమ్‌‌ ఏర్పాటు చేసుకోలేదు. సీనియర్ల ఒత్తిడికి లొంగిపోతారు. ఇప్పటికీ బాబాయి సంజయ్‌‌ గాంధీ టీమ్‌‌దే పార్టీలో పెత్తనం. పార్టీని నడిపించే విషయంలో కూడా రాహుల్​పై కార్యకర్తలకు అనుమానాలున్నాయి. ఆయన చెల్లెలు ప్రియాంక వాద్రాపైనే వారికి నమ్మకం ఉంది. దీనినిబట్టి కాంగ్రెస్‌‌లో రాహుల్‌‌ కేవలం తల్లిచాటు బిడ్డగానే కనిపిస్తున్నారు.