కాం గ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టే అధ్యక్షుడెవరనేది నేడు తేలిపోనుంది. ఇప్పుడు పార్టీ బాధ్యతలు చూస్తున్న సోనియా గాంధీ రేపో ఎల్లుండో పదవీ విరమణ చేయొచ్చు. సోనియా నిష్క్రమణతో కాంగ్రెస్‌లో ఓ శకం ముగిసినట్లే! సోనియా కాంగ్రెస్‌లోనే కాకుండా దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షుల కంటే కూడా ఎక్కువ కాలం పనిచేసిన పార్టీ అధ్యక్షురాలిగా గుర్తింపు పొందారు.1998 నుంచి 2017 వరకు, 2019 నుంచి 2022 వరకు సుదీర్ఘకాలం పాటు ఆమె పార్టీని నడిపించారు. కాంగ్రెస్ అధ్యక్షుల్లో జవహర్‌లాల్ నెహ్రూ(1929, 1936, 1937, 1951–-1954), ఇందిరా గాంధీ(1959, 1978-–1984), రాజీవ్ గాంధీ (1984-–1991) మాత్రమే ఏడేండ్ల పాటు పార్టీ బాధ్యతల్లో ఉన్నారు. కాంగ్రెస్ బలహీనపడిన ప్రతి సందర్భంలో దాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నించారు. అందుకోసం పార్టీ అధ్యక్ష పదవిని వదులుకోవడానికి కూడా ఆమె సిద్ధపడ్డారు. వరుస వైఫల్యాల తర్వాత పార్టీ సంక్షోభంలో ఉన్న సందర్భంలో దానికి తిరిగి ప్రాణం పోయడానికి ఆమె ‘నవ్ చింతన్ -శివిర్ – ఉదయ్‌పూర్ డిక్లరేషన్ 2022లో’ తన దైన ముద్ర వేశారు. ప్రస్తుతం భారత్ జోడో పాదయాత్రను రాహుల్ గాంధీ చేపడుతున్నా.. కాంగ్రెస్ పునరుజ్జీవనంకు బ్లూప్రింట్ వేసిన క్రెడిట్సోనియాకే దక్కుతుంది.
విదేశీ మూలాలు ఉన్న వ్యక్తిగా
1917లో అనీబీసెంట్,1933లో నెల్లీ సేన్ గుప్తా తర్వాత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న మూడో విదేశీయురాలిగా సోనియా గుర్తింపు పొందారు. స్వాతంత్య్రానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన మొదటి విదేశీ మూలాలు ఉన్న వ్యక్తి కూడా ఆమెనే. ఎక్కడో పుట్టిన ఆమె భారతదేశంలో పెండ్లి చేసుకుంది. ఇక్కడే తల్లి అయింది. సోనియా ఒడిలోనే ఆమె అత్త ఇందిరా కన్నుమూశారు. భర్త రాజీవ్‌గాంధీని కోల్పోయి ఆమె వితంతువు అయ్యారు. వ్యక్తిగతంగా ఇలా ఎన్నో బాధలు, విషాదాలు ఎదుర్కొన్నప్పటికీ.. సోనియా ఇండియాను విడిచిపెట్టి వెళ్లాలని ఎప్పుడూ ఆలోచించలేదు. అది ఆమె విశిష్ట లక్షణం. ఈ దేశ ప్రజలు కూడా ఆమెను తమ సొంత మనిషిలా అంగీకరించారు. కొందరు ఆమె విదేశీ మూలాలను ఉద్దేశపూర్వకంగా వివాదంగా మార్చారు. రాజకీయంగా సోనియాను అంతం చేసేందుకు దాన్నొక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. విదేశీ మూలాలనే అభియోగం ఆమె చేతిలో రాజకీయ అస్త్రంగా మారింది. సోనియా1999 మే నెలలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఆమె నాయకత్వాన్ని కాంగ్రెస్ మాత్రమే కాదు, దేశం మొత్తం ఆమోదించి, మద్దతుగా నిలిచింది.1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ లోక్‌సభలో రెండు సీట్లు, ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, కర్నాటకలోని బళ్లారి నుంచి ఒకటి గెలిచింది. దీంతో ఆమెకు కాంగ్రెస్ పునర్నిర్మాణానికి కావాల్సిన వేదిక, సమయం దొరికాయి. ఆ తర్వాత కాంగ్రెస్10 రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి వచ్చింది. సోనియా నాయకత్వంలో 2004లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. 2009లో ఆమె లోక్‌సభలో పార్టీ సీట్ల సంఖ్యను 200కి పెంచింది. కాగా ఈ సంఖ్య1991లో రాజీవ్‌గాంధీ హయాంలో గెలిచిన199 సీట్ల కంటే ఎక్కువ.
రెస్క్యూ మిషన్
సోనియా గాంధీ పార్టీ బాధ్యతలు చేపట్టే కంటే ముందు1997లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి హయాంలో పార్టీ బాగా చితికిపోయి ఉన్నది. పార్టీని ఆయన పతనావస్థకు నెట్టారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను కాపాడేందుకు సోనియా రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. పరిస్థితిని బాధ్యతగా స్వీకరించిన ఆమె1998లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయాలనుకుంటున్నట్లు1997 డిసెంబర్ 29న ప్రకటించారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. కానీ ఆమె తన బాధ్యత నుంచి మాత్రం పారిపోలేదు. 1998 మార్చి 6న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమెను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. అదే ఏడాది ఏప్రిల్6న ఏఐసీసీ ఆమె ఎన్నికను ఆమోదించింది. ఆమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా ఉంటూ.. లోక్‌సభలో శరద్‌పవార్‌ను ఫ్లోర్‌లీడర్, ప్రతిపక్ష నాయకుడిగా, రాజ్యసభలో మన్మోహన్సింగ్ను ఫ్లోర్‌లీడర్, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడిగా నియమించింది. కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలిగా సోనియా తన పదవీకాలం మొత్తం గుణాత్మక పాత్రను పోషించారు. ఆమె బాధ్యతలు చేపట్టిన మొదట్లో, పదవీ విరమణ చేస్తున్న ఈ సమయంలో పార్టీ తీవ్ర సవాళ్లను ఎదుర్కొన్నది. ఈ రెండు సందర్భాల్లో పార్టీని రక్షించడానికి, పార్టీ భావజాలం, ఆలోచనలు అంతరించిపోకుండా ఆమె కీలకంగా వ్యవహరించారు. నిజానికి సోనియా తన రాజకీయ జీవితం ప్రారంభంలోనే దేశంలో విభజన, పోలరైజ్డ్శక్తుల ఎజెండాపై పోరాడేందుకు భారత్జోడోను రూపొందించారు. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా పాదయాత్రగా కొనసాగుతున్నది. పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో 1998 సెప్టెంబర్‌లో పంచమర్హిలో సోనియా మేధోమథన సదస్సు నిర్వహించి విధానపరమైన విషయాలపై స్పష్టత తెచ్చారు. అదే ఏడాది నవంబర్‌లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆమె రాజకీయంగా సవాలు తీసుకొని మరీ ఆ మూడు రాష్ట్రాల్లో పార్టీకి విజయాలు అందించారు.
పునరుద్ధరణ కోసం బ్లూప్రింట్
కాంగ్రెస్‌లో చీలిక తెచ్చేందుకు సోనియా విరోధులు 2020లో ఓ ప్లాన్ వేశారు. జీ 23లో ఉన్న శక్తివంతమైన నాయకులు కొందరు కాంగ్రెస్‌లో అలజడి సృష్టించేందుకు మిగతా వారిని రెచ్చగొట్టారు. సోనియా ఆసుపత్రిలో ఉన్న సమయంలో జీ 23 నాయకులు లేఖను బయట పెట్టిన విషయం తెలిసిందే. నిజానికి ఆ సమయంలో ఆమెను వ్యక్తిగతంగా కలిసేందుకు వారికి అవకాశం ఉన్నా.. ఏఐసీసీ సెషన్‌ను అభ్యర్థించడం ద్వారా పార్టీ ప్రెసిడెంట్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేసేలా ప్రచారం చేయడానికి లేఖను అస్త్రంగా వాడుకున్నారు. కానీ సోనియా మాత్రం సంయమనం కోల్పోకుండా పార్టీ పనుల్లో నిమగ్నమయ్యారు. పెండింగ్‌లో ఉన్న సంస్థాగత నియామకాలను క్లియర్ చేయడానికి ఆమె జీ23 సమావేశానికి హాజరై పరిస్థితులను చక్కదిద్దారు. 1998లో పంచమర్హిలో, 2003లో సిమ్లాలో జరిగిన మేధోమథన సదస్సుల లాగే సోనియా గాంధీ మరోసారి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నవ సంకల్ప్ చింతన్-శివిర్‌ను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయాత్మకమైన రాజకీయ పోరాటానికి, పార్టీ శ్రేణులను సమీకరించడానికి అదొక ప్రధాన అడుగు. అవినీతి మూలాలను తరిమికొట్టడంతోపాటు విద్య, ఉపాధి, ఆహార, సమాచార హక్కుల కోసం సోనియా కృషి చేశారు. 2010లో బురారీలో జరిగిన ఏఐసీసీ సెషన్‌లో ఆమె అవినీతిని అంతమొందించేందుకు ఓ బ్లూప్రింట్‌ను ఆవిష్కరించారు. ఇలాంటి మహిళా నేతలు కాంగ్రెస్ పార్టీలో అరుదు.
ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా..
సోనియా గాంధీ పార్టీ బాధ్యతలు తీసుకొని విజయపథంలో నడిపించడమే కాకుండా, 2004లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోయూపీఏ ప్రభుత్వాన్ని ఏకతాటిపైకి తెచ్చే రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఆమె యూపీఏ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం వచ్చింది. నిజానికి ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టవచ్చు. ఆమె తన నిజాయతీని చాటుకొని మన్మోహన్ సింగ్‌ను ఎంపిక చేశారు. అంత శక్తిమంతమైన, ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి పదవిని ఎవరూ అంత తేలిగ్గా వదులుకోలేరు. సోనియాకు అంతకు ముందు కూడా మూడుసార్లు గొప్ప అవకాశాలు వచ్చినా.. ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించారు. రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమెను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకుంది. అది ప్రధానమంత్రి కావడానికి టిక్కెట్టు లాంటిది. కానీ, ఆమె నిరాకరించింది. బదులుగా పీవీ నరసింహారావు పేరును సూచించారు. రెండోసారి1995లో అర్జున్ సింగ్ పీవీ నరసింహారావుపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సందర్భంలోనే ఆమెకు అవకాశం వచ్చినా తీసుకోలేదు. మూడోసారి 2004లో ఆమె ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా, యూపీఏ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ఎన్నికై ప్రధాని రేసులో ఉన్నా.. ఆ పదవిని చేపట్టలేదు. ఇలా అన్ని అవకాశాలు వదులుకొని అధికారం కోసం ఎన్నడూ ఆశపడని, నిజమైన వ్యక్తిత్వం గల మనిషిగా సోనియా నిరూపించుకున్నారు.