అమిత్ షా ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలే.. కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీస్ తిరస్కరణ

అమిత్ షా ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలే.. కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీస్ తిరస్కరణ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌‌ షాపై కాంగ్రెస్ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీస్‌‌ను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌‌ఖడ్ తిరస్కరించారు. అమిత్ షా ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, ఆయన చేసిన కామెంట్లలో నిజం ఉందని స్పష్టం చేశారు. ఈ నెల 25న రాజ్యసభలో డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నిర్వహణ కమిటీలో ఆ పార్టీ అధ్యక్షుడు కూడా ఉండేవారని కామెంట్ చేశారు. 

దీంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని అమిత్ షా వ్యక్తిగతంగా నిందించారని బుధవారం ఆ పార్టీ సభ్యుడు జైరాం రమేశ్ ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వగా, దీన్ని రాజ్యసభ చైర్మన్ గురువారం తిరస్కరించారు. ‘‘ఆనాడు చర్చ సందర్భంగానే తాను చేసిన కామెంట్లకు ఆధారం ఉన్నదని అమిత్ షా చెప్పారు. 1948 జనవరి 24న అప్పటి సర్కార్ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌‌ను ఉదహరించారు. అప్పటి ప్రధాని జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ పీఎంఎన్ఆర్ఎఫ్‌‌ను ప్రకటిస్తూ.. దాని నిర్వహణ కమిటీలో ప్రధాని, కాంగ్రెస్ చీఫ్ ఉంటారని తెలిపారని అమిత్ షా పేర్కొన్నారు. ఆ ప్రెస్‌‌ రిలీజ్‌‌ను పరిశీలించాను. అందులో ఉన్నదే అమిత్ షా చెప్పారు” అని ధన్‌‌ఖడ్ తెలిపారు. 

ఎంపీ పప్పూ యాదవ్‌‌పై స్పీకర్ ఆగ్రహం.. 

బిహార్‌‌‌‌ ఎంపీ పప్పూ యాదవ్‌‌పై లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. గురువారం సభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పక్కన పప్పూ యాదవ్ కూర్చున్నారు. అప్పుడు ఆయన రామ్మోహన్ నాయుడు భుజాలపై చేతులు వేసి, ఏదో మాట్లాడుతుండగా.. సభలో అలా చేయొద్దని స్పీకర్ ఓం బిర్లా హెచ్చరించారు.