నిరుద్యోగులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్.. నెలకు రూ.15 వేలు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని నిరుద్యోగులకు కాంగ్రెస్ శుభవార్త చెప్పింది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ఏడాది పాటు రూ.8,500 చొప్పున ఆర్ధిక సహయం అందజేస్తామని హస్తం పార్టీ హామీ ఇచ్చింది. యువ ఉడాన్ యోజన పథకం కింద సహయం చేస్తామని తెలిపింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ యువ ఉడాన్ యోజనను ఆదివారం (జనవరి 12) ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కంపెనీ, ఫ్యాక్టరీ లేదా సంస్థలో నైపుణ్యాన్ని ప్రదర్శించగల యువతకు ఆర్థిక సహాయం అందిస్తాం. వారు ఈ కంపెనీల ద్వారా డబ్బు పొందుతారు. యువ ఉడాన్ యోజన ఇంట్లో కూర్చొని డబ్బు పొందే పథకం కాదు" అని పైలట్ పేర్కొన్నారు. 

2025, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దేశ రాజధానిలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. గతంలో వరుసగా ఢిల్లీని పాలించిన కాంగ్రెస్.. రాజధానిలో పునర్ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజలకు హామీల వర్షం కురిపిస్తోంది గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ఇప్పటికే రెండు ప్రధాన హామీలు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ALSO READ | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ​29 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో లిస్ట్

ప్యారీ దీదీ యోజన స్కీమ్ కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం ఒకటి,  జీవన్ రక్ష యోజన పథకం కింద రూ. 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని కాంగ్రెస్ వాగ్ధానం చేసింది. తాజాగా యువ ఉడాన్ యోజన కింద నిరుద్యోగులకు సంవత్సరం పాటు నెలకు రూ.8500 ఇస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షాలైనప్పటికీ కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పోటీలో ఉన్న దేశ రాజధానిలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ మధ్యనే ప్రధానంగా పోరు ఉండనుంది.