- మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు
నర్సాపూర్, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతూ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నర్సాపూర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించి పీఎం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు.
నిధులు రాబట్టడంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు విఫలమయ్యారని, ఇద్దరు మంత్రులు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షుడు మల్లేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిజ్వాన్, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, మణిదీప్, అశోక్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సందీప్ పాల్గొన్నారు.
ప్రతీ బడ్జెట్లో తెలంగాణపై వివక్ష
సిద్దిపేట టౌన్ : కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ లో తెలంగాణపై వివక్ష చూపుతోందని సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ విమర్శించారు. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దిష్టిబొమ్మలు దహనం చేసి, రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీజేపీప్రభుత్వం తెలంగాణకు ఎన్ని నిధులు కేటాయించిందో చెప్పాలన్నారు. ఏపీ, తెలంగాణకు కేటాయించిన నిధులను చూస్తే రాష్ట్రంపై బీజేపీ వైఖరి ఏంటో ప్రజలకు అర్థమవుతుందన్నారు.
కేంద్ర బడ్జెట్ పై నిరసన సెగ
సంగారెడ్డి : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు సంగారెడ్డిలో నిరసనకు దిగారు. సంగారెడ్డి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులో కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కానీ తెలంగాణాకు కొత్తగా ఒక్క ప్రాజెక్టు, ఒక్క రూపాయి తీసుకురాలేకపోయారని విమర్శించారు. టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుగౌడ్, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, కుమార్ , సత్యనారాయణ పాల్గొన్నారు.