
స్వప్న లోక్ కాంప్లెక్స్ ఫైర్ ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలని కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, రూ.50 లక్షల ఆర్థిక సాయం వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు న్యాయం చేయకుంటే గాంధీ ఆసుపత్రి నుండి మృతదేహాలను తీసుకువెళ్లనీయమని ఆందోళన దిగారు. ఈ క్రమంలో హాస్పిటల్ ముందు బైటాయించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. గాంధీ మార్చురీ నుండి అగ్ని ప్రమాద మృతులు త్రివేణి, వెన్నెల, శివ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రభుత్వ అంబులెన్స్ లో స్వగ్రామాలకు తరలించారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో మార్చి16న రాత్రి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. ఆరుగురు ఊపిరాడక మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎటు చూసినా హాహాకారాలతో స్వప్నలోక్ కాంప్లెక్స్ పరిసరాల్లో విషాద వాతావరణం అలుముకుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాంప్లెక్స్‌లోని సిబ్బంది, స్థానికులు పరుగులు తీశారు. సెల్లార్లో వైర్లు కాలి 4, 5, 6 , 7 ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. సుమారు సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్భంది.. ఘటనా స్థలానికి చేరుకొని 12 మందిని కాపాడారు. అందులో ఆరుగురు మరణించారు.
ఇక ఈ అగ్నిప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి 3 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ సూచించారు.