రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం కాంగ్రెస్ లీడర్లు ఆందోళన చేశారు. ధరణి పోర్టల్, పోడు భూములు సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి ఆర్డీఓ ఆనంద్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు, టీపీసీసీ సెక్రటరీ, పెద్దెలి ప్రకాశ్ కొత్త బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ముత్యంపేట చక్కర కర్మాగారం తెరిపించాలని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని, డిమాండ్చేశారు.
కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు నాగల సత్యనారాయణ గౌడ్, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్ లీడర్లతో కలిసి పట్టణ ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. పోడు భూములపై శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అలాగే పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ వేములవాడలోని మహాలక్ష్మి దేవాలయం నుంచి రాజన్న ఆలయం వరకు ర్యాలీ నిర్వహించి, ఆలయం ముందు ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ లో సవరణ చేస్తామని, వీలుకాకపోతే రద్దు చేస్తామని అన్నారు. - వెలుగు, నెట్వర్క్