
నిర్మల్/ ఆదిలాబాద్‌టౌన్/ మంచిర్యాల, వెలుగు: ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను అస్సాంలో బీజేపీ నాయకులు అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీని అడ్డుకోవడం అప్రజాస్వామికమని డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు అన్నారు. రాహుల్‌పై జరిగిన దాడి పట్ల నిర్మల్ పట్టణం గాంధీ పార్క్‌లోని బాపూజీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు.
బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, అయోధ్య ఆలయం సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని శ్రీహరిరావు మండిపడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం అస్సాం సీఎం హిమంతబిస్వ శర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు.
జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్‌గౌడ్ మాట్లాడుతూ రాహుల్‌గాంధీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను తట్టుకోలేక బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మంచిర్యాలలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నేతలు పాల్గొన్నారు.