
- రివ్యూ చేయాలని సీఈవోను కోరిన రాష్ట్ర కాంగ్రెస్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి రిలీజ్ చేసిన వీడియోలు ఏవీ మార్చలేదని, మిస్యూజ్ కూడా చేయలేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ యాడ్స్ నిలిపివేయడంపై ముందుగా తమకు నోటీసు ఇవ్వకుండా, టీవీలకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. సోమవారం ఈ మేరకు సీఈవో వికాస్‌రాజ్‌ను ఏఐసీసీ అధికార ప్రతినిధి అజయ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కలిశారు.
తమ పార్టీ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి ఇచ్చిన వీడియోలు.. టీవీల్లో ప్లే అవుతున్నవి రెండూ పక్కపక్కన పెట్టి చూడాలని సీఈవోను కోరారు. తమకు అనుమతి వచ్చిన యాడ్స్ ఎలా ఉన్నాయో.. వాటినే టీవీల్లో, సోషల్ మీడియాల్లో ప్లే చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈసీఐ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్న తమకు సంబంధించిన యాడ్స్ ఆపేయడంపై రివ్యూ చేయాలని కోరినట్లు మీడియాకు తెలిపారు.
మమ్మల్ని వివరణ కూడా అడగలే: అజయ్
తమ పార్టీకి చెందిన 4 యాడ్స్ ఆపాలన్న విషయాన్ని తమకు చెప్పడాని కంటే ముందే టీవీలు, సోషల్ మీడియా చానళ్ల ఎడిటర్లకు లెటర్లు పంపారని, తమ నుంచి వివరణ కూడా తీసుకోలేదని అజయ్ అన్నారు. తాము ప్రచారం చేసే ప్రతి యాడ్ ఎంసీఎంసీ అనుమతి తీసుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీసులు బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ALSO READ : గ్రాసిమ్ ప్రాఫిట్ రూ.1,164 కోట్లు
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్న ప్రకటనలు అభ్యంతరకరంగా ఉంటే తమకే నోటీసు ఇవ్వాలి కానీ, యాడ్స్ ప్రసారం అవుతున్న టీవీ చానళ్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై రివ్యూ చేస్తామని సీఈవో చెప్పినట్లు తెలిపారు.