ఈవీఎంలపై ఇండియా కూటమి అభ్యంతరాలపై విమర్శలకు దిగిన జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాపై కాంగ్రెస్ ఘాటుగానే స్పందించింది. ఒమర్ సీఎం అయ్యాక మాట మారింది ఎందుకో.. అని ప్రశ్నించింది. మహారాష్ట్రలో ఓటమి తర్వాత ఇండి కూటమి ఈవీఎంలపై అభ్యంతరాలు వెలువరిస్తున్న తరుణంలో సొంత కూటమి నేత అయిన ఒమర్ అబ్దుల్లా విమర్శలకు దిగడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఇండి కూటమి అభ్యంతరాలపై ఇటీవల ఒమర్ మాట్లాడుతూ.. ‘‘మీరు పార్లమెంటు ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలిచినపుడు ఈవీఎంలపై ఎలాంటి ప్రశ్న ఉండదు. విజయోత్సవాలు చేసుకుంటారు.. అదే కొన్ని నెలల తర్వాత ఓటమి ఎదురైతే మాత్రం.. ఫలితాలు మేము ఊహించినట్లుగా లేవు.. ఈవీఎంలలో ఏదో తేడా ఉంది.. ఈవీఎంలపై తమకు విశ్వాసం లేదని అంటారు.’’ అని విమర్శించారు.
ఒమర్ అబ్దుల్లా విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం అయ్యాక ఒమర్ మాట ఎందుకో మారిందని విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన (యుబిటి) ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడాయని, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ ఈ విషయంలో కేవలం కేంద్ర ఎన్నికల కమిషన్ కు మాత్రమే వివరించామని, వాస్తవాలు తెలుసుకోవాలని ఒమర్ అబ్దుల్లాకు సూచించారు. ముఖ్యమంత్రి అయ్యాక సొంత కూటమిపై ఈ విధమైన వైఖరికి కారణమేంటో అని ఠాగూర్ ప్రశ్నించారు.
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈవీఎంపై అనుమానాలు పెరిగాయి. మహావికాస్ అఘాడీ కూటమికి కనీసం 10 శాతం సీట్లు రాకపోవడంపై విపక్ష కూటమి పార్టీలు ఈవీఎంలై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇదే అంశంపై సీడబ్ల్యూసీ కూడా అవకతవకలు జరిగాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. వాటి పనితీరుపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. ఈ తరుణంలో ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గత ఎన్నికల్లో కశ్మీర్ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ సంయుక్తంగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఒమర్ అబ్దుల్లా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంటూ ఈ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ ఆగ్రహానికి దారితీసింది.