చెన్నూర్​పై సస్పెన్స్.. ముగ్గురు క్యాండిడేట్లను ప్రకటించిన కాంగ్రెస్

  • మంచిర్యాలలో పీఎస్సార్, బెల్లంపల్లిలో గడ్డం వినోద్ 
  • పొత్తులో చెన్నూర్ సీపీఐకి ఖరారైనట్లు ప్రచారం
  • సెకండ్ లిస్టుపై కాంగ్రెస్ లీడర్ల ఆశలు

మంచిర్యాల, వెలుగు:  కాంగ్రెస్​పార్టీ 55 మంది అభ్యర్థులతో ఆదివారం రిలీజ్​చేసిన ఫస్ట్​లిస్టులో మంచిర్యాల జిల్లా నుంచి ఇద్దరికి చోటు దక్కింది. మంచిర్యాలకు మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ మెంబర్​ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు, బెల్లంపల్లి(ఎస్సీ)కి మాజీ మంత్రి గడ్డం వినోద్ పేర్లను ప్రకటించింది. జిల్లాలోని చెన్నూర్(ఎస్సీ) నియోజకవర్గం క్యాండిడేట్​ను పెండింగ్ లో పెట్టడంపై ఆ పార్టీలో చర్చ మొదలైంది. కాంగ్రెస్, వామపక్షాల పొత్తులో భాగంగా చెన్నూర్​ను సీపీఐకి కేటాయించనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. సీపీఐ తెలంగాణలో ఐదు సీట్లను డిమాండ్ చేసింది. అందులో భాగంగా జిల్లాలోని బెల్లంపల్లిని కేటాయించాలని కోరింది.

గతంలో బెల్లంపల్లి నియోజకవర్గం సీపీఐకి కంచుకోటగా ఉండేది. ఆ పార్టీకి చెందిన దివంగత నేత గుండా మల్లేశ్​ఆసిఫాబాద్, బెల్లంపల్లి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. సింగరేణి ప్రభావిత ప్రాంతమైన బెల్లంపల్లి నియోజకవర్గంలో సీపీఐకి గట్టి పునాదులు ఉండడంతో ఈసారి తమకు కేటాయించాలని ఆ పార్టీ పట్టుబట్టింది. అయితే కాంగ్రెస్​నుంచి మాజీ మంత్రి గడ్డం వినోద్​ బెల్లంపల్లి టికెట్​ఆశించారు.

గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ఆయన గెలుపు అంచుల దాకా వచ్చి ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్​హైకమాండ్​ బెల్లంపల్లి నుంచి వినోద్​ను బరిలోకి దించాలని డిసైడ్ అయ్యింది. అంతేగాకుండా కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కాకా వెంకటస్వామితో ఏఐసీసీ చీఫ్ ​మల్లికార్జున ఖర్గేకు ఉన్న సాన్నిహిత్యం వల్ల వినోద్ ​వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా సీపీఐకి బెల్లంపల్లికి బదులుగా చెన్నూర్ నియోజకవర్గాన్ని ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్​ లీడర్లు ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. పార్టీ హైకమాండ్​ సెకండ్​లిస్టులో చెన్నూర్​ టికెట్​ను ప్రకటించే చాన్స్​ ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్​ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, డాక్టర్​రాజా రమేశ్, నూకల రమేశ్, దుర్గం భాస్కర్, డాక్టర్​ దాసారపు శ్రీనివాస్, రామిళ్ల రాధిక తదితరులు దరఖాస్తు చేశారు. కాంగ్రెస్​ హైకమాండ్​ నుంచి అధికార ప్రకటన కోసం అందరూ టెన్షన్​గా ఎదురుచూస్తున్నారు. 

పీఎస్సార్ ను అదృష్టం వరించేనా? 

కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు అంచలంచెలుగా ఉమ్మడి జిల్లాలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007 నుంచి 2013 వరకు ఆదిలాబాద్​ లోకల్ బాడీస్​ ఎమ్మెల్సీగా కొనసాగారు. 2014లో సిర్పూర్(టి) నియోజకవర్గం నుంచి పోటీ చేసి 18వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో మంచిర్యాల నుంచి బరిలో నిలిచి కేవలం 4 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న పట్టుదలతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాత్రం పీఎస్సార్​గెలిస్తే మంచిర్యాలలో గూండారాజ్యం వస్తుందని, భూకబ్జాలు పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. ఈసారైనా పీఎస్సార్​ను అదృష్టం వరిస్తుందో లేదో డిసెంబర్​3న తేలనుంది.

బెల్లంపల్లి నుంచి వినోద్ రెండోసారి..

కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాకా వెంకటస్వామి వారసుడిగా వినోద్​2004లో చెన్నూర్​ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడ జనార్దన్​పై గెలిచి వైఎస్సార్​ క్యాబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థిగా బరిలో నిలిచి టీఆర్ఎస్​అభ్యర్థి నల్లాల ఓదెలు చేతిలో ఓడిపోయారు. 2018లో చెన్నూర్​ టికెట్​ రాకపోవడంతో బెల్లంపల్లి నుంచి బీఎస్పీ గుర్తుపై పోటీ చేశారు. టీఆర్ఎస్​ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు ముచ్చెమటలు పట్టించినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈసారి గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు.

నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరి రావు

నిర్మల్: నిర్మల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరిరావు పేరును ఖరారు చేస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నిర్మల్ సెగ్మెంట్​పై క్లారిటీ వచ్చినప్పటికీ ముథోల్, ఖానాపూర్ సెగ్మెంట్లపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. నిర్మల్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి రావు 1995 లో మామడ మండల ఎంపీపీగా ఎన్నికయ్యా రు. అదే ఏడాది జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా ఆయన ఎన్నికయ్యారు. 2001 మామడ మండల జడ్పీటీసీగా, 2001 నుంచి 2006 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా కొనసాగారు. 2002లో అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా 2005లో అప్పటి ఆంధ్రప్రదేశ్ పీసీసీ కమిటీ మెంబర్​గా పని చేశారు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2007లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన శ్రీహరి రావు 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2010 నుంచి 2013 వరకు బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షునిగా నియమితులయ్యారు. 2014లో మరోసారి బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే అంతర్గత అభిప్రాయ బేధాలు, అధిష్టానంపై అసంతృప్తితో శ్రీహరి రావు జూన్​లో కాంగ్రెస్ లో చేరారు.