- మోదీ, కేజ్రీవాల్ పేర్లు మాత్రమే వేరు.. ఇద్దరి చేతలు ఒక్కటే
- వాతావరణంతో పాటు రాజకీయ కాలుష్యం పెరిగిపోయిందని వ్యాఖ్య
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల పోస్టర్ విడుదల
- పవర్లోకి వస్తే 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, రూ.500కే గ్యాస్ ఇస్తామని హామీ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో తమ ప్రభుత్వం కేసీఆర్ అవినీతిని నిర్మూలించి.. హామీలను అమలు చేస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అవినీతిని నిర్మూలిస్తే హామీలు నెరవేర్చవచ్చని తెలిపారు. ‘‘తెలంగాణలో లిక్కర్ స్కామ్ పార్ట్నర్ ను ఓడించినం. ఢిల్లీలో అసలు పార్ట్నర్ను ఓడిస్తం” అని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం డీడీయూ మార్గ్ లోని కాంగ్రెస్పార్టీ ఢిల్లీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరఫున గ్యారంటీల పోస్టర్ను ఆయన విడుదల చేశారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తం. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తం. -సామాగ్రి కిట్ (5 కిలోల బియ్యం, 2 కిలోల చక్కెర, లీటర్ వంట నూనె, 6 కిలోల పప్పులు, 250 గ్రాముల టీ పొడి) పంపిణీ చేస్తం’’ అని ప్రకటించారు. తాము ఎన్నికల కోసం రాజకీయాలు చేయడం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామన్న హామీని సోనియాగాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని, అందుకే ఇప్పుడు ఢిల్లీలోనూ వాగ్దానాలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ. 22 వేల కోట్ల రుణమాఫీ చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. స్వతంత్ర భారత చరిత్రలో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదన్నారు. 11 ఏండ్లలో ప్రధాని మోదీ కార్పొరేట్ కంపెనీలకు రూ.16 లక్షల కోట్ల అప్పులను మాఫీ చేశారని.. జనాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
దేశంలో అతి పెద్ద సమస్య నిరుద్యోగమని, ఆ సమస్యను ప్రధాని మోదీ పరిష్కరించడం లేదని విమర్శించారు. తెలంగాణలో తాము ఏడాదిలోనే 53 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని సీఎం వెల్లడించారు. దావోస్లో జరిగే సదస్సు నుంచి తెలంగాణకు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మోదీ, కేజ్రీవాల్ పేర్లు వేరు.. చేతలు ఒక్కటే
ఢిల్లీ సీఎంగా మూడుసార్లు గెలుపొందిన షీలా దీక్షిత్.. మెట్రో రైల్, ఫ్లైఓవర్లు, అనేక అభివృద్ధి పనులు చేపట్టారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. కానీ మూడుసార్లు ప్రధాని అయిన మోదీ, మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ ఢిల్లీకి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ‘‘మోదీ, -కేజ్రీవాల్ పేర్లు వేరు. వారి చేతలు మాత్రం ఒక్కటే” అని విమర్శించారు. ఢిల్లీలో వాతావరణంతో పాటు రాజకీయ కాలుష్యం పెరిగిపోయిందన్నారు. కాంగ్రెస్ హామీలతో ఢిల్లీలో పేదల స్థితిగతులు మెరుగవుతాయని, కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన కోరారు.
తెలంగాణలో 1.50 శాతం ఓట్లతో ప్రయాణాన్ని ప్రారంభించిన కాంగ్రెస్... 40 శాతం ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిందన్నారు. ‘‘మా పార్టీకి లోక్సభలో 100 మంది ఎంపీలు, రాజ్యసభలో కావాల్సిన బలం ఉంది. అవసరమైతే ఢిల్లీ సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఇరు సభల్లో ఒత్తిడి తేగలదు. మరి కేజ్రీవాల్ ఏం చేయగలరో ప్రజలకు చెప్పాలి” అని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో ఢిల్లీ కాంగ్రెస్ ఇన్చార్జ్ నిజాముద్దీన్, అక్కడి పీసీసీ చీఫ్ దేవేంద్ర యాదవ్ పాల్గొన్నారు.