ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 23 మంది పేర్లతో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ.. పలువురు కీలక నేతలకు ఈ జాబితాలో టికెట్లు కేటాయించింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ వర్గం) పట్టుబట్టిన దక్షిణ నాగ్‌పూర్ అసెంబ్లీ సీటుపై ఎట్టకేలకు పీఠముడి వీడింది. సుధీర్ఘ చర్చల అనంతరం ఈ సీటును కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
దక్షిణ నాగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తోన్న మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌పై సీనియర్ నేత, మాజీ మంత్రి గిరీష్ కృష్ణరావు పాండవ్ను కాంగ్రెస్ బరిలోకి దించింది. మహా వికాస్ అఘాడీ కూటమి పొత్తులో భాగంగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి 85 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. 85 స్థానాలకు గానూ తొలి జాబితాలో 48 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన కాంగ్రెస్.. శనివారం (అక్టోబర్ 26) 23 మంది పేర్లతో రెండో జాబితాను ప్రకటించింది.
రెండు జాబితాలతో కలిపి మొత్తం 71 సీట్లకు కాంగ్రెస్ క్యాండిడేట్లను ఫిక్స్ చేసింది. మిగిలిన 14 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ హై కమాండ్ కసరత్తు చేస్తోంది. కాగా, 2024, అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 2024, నవంబర్ 20వ తేదీన సింగల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.
కాంగ్రెస్ సెకండ్ లిస్ట్:
- నాగ్‌పూర్ సౌత్ - గిరీష్ కృష్ణరావు పాండవ్
- కమ్తి - సురేష్ యాదవ్రావ్ భోయార్
- భండారా (SC) - పూజ గణేష్ తావ్కూర్
- అర్జున్-మోర్గావ్ (SC) - దలీప్ వామన్ బన్సోడ్
- అమగావ్ (ఎస్టీ) - రాజ్‌కుమార్ లోటుజీ పురం
- రాలేగావ్ - ప్రొ. వసంత్ చిందుజీ పుర్కే
- చార్కోప్- యశ్వంత్ జయప్రకాష్ సింగ్
- జలగావ్ - డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్
- అకోట్ - మహేష్ గంగనే
- నీలంగా - అభయ్‌కుమార్ సతీష్‌రావు సాలుంఖే
- భుసావల్ - డాక్టర్ రాజేష్ తుకారాం మాన్వత్కర్
- శిరోల్ - గణపతిరావు అప్పాసాహెబ్ పాటిల్
- యావత్మాల్ - అనిల్ బాలాసాహెబ్ శంకర్రావ్ మంగూల్కర్
- వార్ధా - శేఖర్ ప్రమోద్బాబు షెండే
- సావ్నర్ - అనూజ సునీల్ కేదార్
- సియోన్ కోలివాడ - గణేష్ కుమార్ యాదవ్
- వసాయ్ - విజయ్ గోవింద్ పాటిల్
- కండివాలి తూర్పు - కాలు బధేలియా
- శ్రీరాంపూర్ (SC) - హేమంత్ ఒగలే
- ఆర్ని (ఎస్టీ) - జితేంద్ర శివాజీరావు మోఘే
- ఉమర్‌ఖేడ్ (SC) - సాహెబ్రావ్ దత్తారావు కాంబ్లే
- జల్నా - కలియాస్ కిషన్‌రావ్ గోర్తంత్యాల్
- ఔరంగాబాద్ తూర్పు - మధుకర్ కృష్ణారావు దేశ్‌ముఖ్