కాంగ్రెస్ లో ఆ ముగ్గురే మిగులుతారు : ఫిరాయింపు ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ లో ఆ ముగ్గురే మిగులుతారు : ఫిరాయింపు ఎమ్మెల్యేలు

3, 4 రోజుల్లో టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ఎల్పీ విలీనం

హైదరాబాద్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఆసక్తికరమైన కామెంట్స్

హైదరాబాద్: ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ నాయక్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ఎల్పీలో… సీఎల్పీ విలీనం ఖాయం అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల బీ ఫార్మ్స్ కోసం పార్టీ ఆఫీస్ కు వచ్చామని చెప్పారు. “ఆ ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ లో మిగులుతారు. మిగిలిన వారంతా TRS లోకే వస్తారు. మూడు, నాలుగు రోజుల్లో టీఆర్ఎస్ఎల్పీలో కాంగ్రెస్ విలీన ప్రక్రియ పూర్తవుతుంది. విలీనానికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం” అన్నారు ఎమ్మెల్యేలు.

ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆత్రం సక్కు, రేగా కాంతారావు, బానోతు హరిప్రియా నాయక్, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కందాళ ఉపేందర్ రెడ్డి, వనమావెంకటేశ్వర్ రావు, సుధీర్ రెడ్డి, జాజుల సురేందర్ ఉన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పే కొత్తగా ముగ్గుర్ని టీఆర్ఎస్​లో చేర్చుకొని మరోసారి కాంగ్రెస్ నేతలకు ఝలక్ ఇవ్వాలని గులాబీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏకపక్షంగా తమ వైపే ఉంటాయని భావిస్తున్నారు. కొత్తగా చేరే ముగ్గురితో కలిపి టీఆర్ఎస్ బాటపట్టిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేల సంఖ్య 13 కు చేరుకుంటుంది. కాంగ్రెస్​ శాసనసభా పక్షాన్ని(సీఎల్పీ) టీఆర్ఎస్ లో విలీనంచేసేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉండటంతో ఆ విలీన ప్రక్రియను కొత్త రెవెన్యూ చట్టం ఆమోదం కోసం.. జూన్ మొదటి వారంలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లోపే పూర్తి చేయాలని అధికార పార్టీ​ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చేసిన కామెంట్స్ తో భవిష్యత్ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతోంది.