మేక్ ఇన్ కాదు.. ఫేక్ ఇన్ ఇండియా .. కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్ ఫైర్

మేక్ ఇన్ కాదు.. ఫేక్ ఇన్ ఇండియా .. కాంగ్రెస్ ప్రతినిధి జైరాం రమేశ్ ఫైర్

న్యూఢిల్లీ: 'మేక్ ఇన్ ఇండియా' కేవలం 'ఫేక్ ఇన్ ఇండియా'గా మారిందని కాంగ్రెస్​పార్టీ విమర్శించింది. మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించిన సమయంలో మోదీ ప్రభుత్వం పేర్కొన్న లక్ష్యాలు 'జుమ్లాస్'గా మారాయని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో ఆర్థిక విధాన రూపకల్పన స్థిరంగా, ఊహాజనితంగా, తెలివైనదిగా లేదని సోమవారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌‌‌‌చార్జ్ జైరాం రమేశ్​ఎక్స్​వేదికగా విమర్శించారు. 2014లో ప్రధాని మోదీ 'మేక్ ఇన్ ఇండియా'ను ఎంతో ఆర్భాటంగా ప్రారంభించినప్పుడు నాలుగు కీలక లక్ష్యాలను వివరించారని ఆయన తెలిపారు. అయితే, 10 సంవత్సరాల తర్వాత వాస్తవ పరిస్థితి వేరే ఉందని, ఆ లక్ష్యాలన్నీ జుమ్లాస్ గా మారాయని ఆయన విమర్శించారు.

 ఆ అంశాలను జైరాం తన ట్వీట్​లో పేర్కొన్నారు. గత దశాబ్దంలో ఆర్థిక విధాన రూపకల్పన స్థిరంగా లేదని, ఇందుకు కారణం పెద్ద నోట్లను రద్దు చేయడమేనని ఆయన ఉదాహరణగా చెప్పారు. అలాగే, దేశంలో భయం, అనిశ్చితి వాతావరణంతో ప్రైవేట్ పెట్టుబడుల వృద్ధికి ఆటంకం ఏర్పడిందని పేర్కొన్నారు. మోదీకి సన్నిహితంగా ఉండే ఒకట్రెండు బడా వ్యాపారులనే ఆదరించడం, అభివృద్ధి చేయడం వల్ల పోటీ అణచివేయబడిందని.. దాంతో మేక్ ఇన్ ఇండియా కాస్త ఫేక్ ఇన్ ఇండియాగా మారిందని జైరాం రమేశ్​ఆరోపించారు.