దేశంలో వచ్చేది కాంగ్రెస్ రాజ్యమే : రోహిత్ చౌదరి

బెల్లంపల్లి, వెలుగు: దేశంలో వచ్చేది కాంగ్రెస్‌ రాజ్యమేనని ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి రోహిత్ చౌదరి అన్నారు. మతోన్మాద పాలన సాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పదేండ్ల పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ కోల్పోయిందన్నారు. ఎక్కడ చూసినా అల్లర్లు, హింస చెలరేగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆరు గ్యారంటీలు ప్రవేశపెట్టి.. ఐదింటిని అమలు చేసి దేశంలో చరిత్ర సృష్టించారన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ విజయ భేరి మోగిస్తుందన్నారు. 

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సూచించారు. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం యాదవ్, పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జి బండి ప్రభాకర్ యాదవ్, నాయకులు నాతరి స్వామి, ఎండీ నిజాముద్దీన్, బండి రాము, లెంకల శ్రీనివాస్, సోదై వినేశ్‌ తదితరులు పాల్గొన్నారు.