తెలంగాణ రాష్ట్రంలో మరో పదేండ్లు కాంగ్రెస్ దే అధికారం : ఎంపీ మల్లు రవి

తెలంగాణ రాష్ట్రంలో మరో పదేండ్లు కాంగ్రెస్ దే అధికారం : ఎంపీ మల్లు రవి

ఆమనగల్లు, వెలుగు: రాష్ట్రంలో మరో పదేండ్లు  కాంగ్రెస్  అధికారంలో ఉంటుందని, సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని నాగర్ కర్నూల్  ఎంపీ మల్లు రవి తెలిపారు. తిరిగి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్  నేతలు పగటి కలలు కంటున్నారని, అది కలగానే మిగులుతుందని ఆయన జోస్యం చెప్పారు. బుధవారం మాడ్గుల్  మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గాన్ని ప్రభుత్వం పంచాయతీరాజ్  హబ్ గాఎంపిక చేసిందని, దీంతో నియోజకవర్గంలోని ప్రతి పల్లె, తండాకు బీటీ రోడ్డు ఏర్పాటవుతుందని చెప్పారు. ఇప్పటికే రూ.296 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ కేఎల్ఐ ద్వారా నియోజకవర్గంలో 34 వేల ఎకరాలకు సాగు నీటిని అందిస్తామని తెలిపారు. మాడ్గుల్  మండలంలోని చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీసీసీ సెక్రటరీ రాంరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బట్టు కిషన్ రెడ్డి, పద్మారెడ్డి, జంగయ్య, వెంకటేశ్వర్లు గౌడ్, తాండ్ర సాయిరెడ్డి, డీఈవో సుశీందర్ రావు, ఏసీపీ రాజు పాల్గొన్నారు.