- డ్రగ్స్ డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నది
- ఆ పార్టీ ఆలోచన విధానం ఫస్ట్నుంచి విదేశీయమే
- పంట రుణాల మాఫీపై తప్పుడు హామీలు ఇస్తున్నది
- తెలంగాణలో రైతులు మాఫీ కోసం ఎదురుచూస్తున్నారని ప్రధాని మోదీ విమర్శ
వాషిం: కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంపట్ల మంచి ఉద్దేశాలు లేనివారికి ఆ పార్టీ ఆశ్రయం ఇస్తున్నదని విమర్శించారు. డ్రగ్స్ డబ్బులతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించేందుకు మనమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. శనివారం మహారాష్ట్రలోని వాషిం జిల్లా, థానేలో మోదీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వాషింలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ తన స్వార్థ రాజకీయాల కోసం పేదలను దోచుకుంటున్నదని, ఇన్నేండ్ల పాలనలో వారి స్థితిగతులను ఏమాత్రం మెరుగుపరచ లేదని విమర్శించారు. ఆ పార్టీకి దేశాన్ని విభజించడం మాత్రమే తెలుసున్నారు. కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతున్నదన్నారు. దేశమంటే మంచి ఉద్దేశం లేనివాళ్లకు చాలా సన్నిహితంగా ఉంటుదన్నారు. ఆ పార్టీని ఓడించేందుకు మనం అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ నేత కింగ్‌పిన్
ఇటీవల ఢిల్లీలో వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయని, అందులో కాంగ్రెస్ నేత ఒకరు కింగ్‌పిన్‌గా ఉన్నట్టు అనుమానిస్తున్నారని మోదీ తెలిపారు. యువతను డ్రగ్స్ ఊబిలోకి నెట్టి.. దాని ద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ఆలోచన విధానం మొదటి నుంచీ విదేశీయమని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగం
కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమయ్యాయని మోదీ ఆరోపించారు. సాగునీటి స్కీమ్‌లు, రైతుల కోసం తెచ్చిన స్కీముల్లో అవినీతి జరిగిందన్నారు. రుణమాఫీపై ఆ పార్టీ తప్పుడు హామీలు ఇస్తున్నదని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. తెలంగాణ రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు రిలీజ్
మహారాష్ట్రలో సాగు, పశుపోషణ అభివృద్ధికి రూ.23,300 కోట్లతో పలు పథకాలను మోదీ ప్రారంభించారు. ప్రధాని- కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడతగా రూ.20 వేల కోట్లను రిలీజ్ చేశారు. అలాగే మహారాష్ట్ర రైతులకు ప్రత్యేకంగా నమో షెత్కారీ మహాసన్మాన్ నిధి యోజన కింద రూ.2 వేల కోట్లు ఇచ్చారు.
సంత్ సేవాలాల్‌కు నివాళి
వాషింలోని పొహరా మాత ఆలయంలో అమ్మవారికి ప్రధాని మోదీ పూజలు చేశారు. బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్, రాజా లఖిషా బంజారాలకు సమాధుల వద్దకు వెళ్లి నివాళి అర్పించారు.
థానే మెట్రోకు శంకుస్థాపన
థానే ఇంటిగ్రల్ రింగ్ మెట్రో, ముంబై మెట్రో పొడగింపులో భాగంగా మెట్రో 3 సహా రూ. 32,800 కోట్ల విలువైన ప్రాజెక్ట్ లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ముంబై అర్బన్ మొబిలిటీని పెంచడానికి మెట్రో లైన్ 3 నిర్మాణ పనులు దాదాపు రూ. 14,120 కోట్లతో ప్రారంభించారు. నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ నోటిఫైడ్ ఏరియా (ఎన్ఏఐఎన్ఏ) ప్రాజెక్ట్ కు కూడా భూమిపూజ చేశారు.