కాసుల్లేని కాంగ్రెస్

కాంగ్రెస్ అంటే మామూలు పార్టీ కాదు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ. అంతేకాదు దేశాన్ని చాలా ఏళ్లు పాలించిన పార్టీ. జవహర్ లాల్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు అందరూ ఈ పార్టీ వల్లనే దేశానికి ప్రధానులయ్యారు. అలాంటి పార్టీ పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం బాగా లేదు. ఎన్నికల్లో ఓడిపోవడం ఒక్కటే కాదు. పైసల విషయంలోనూ కాంగ్రెస్  పార్టీ అనేక ఒడిడుడుకులు ఎదుర్కొంటోంది.

ఏఐసీసీ ప్రెసిడెంట్ పదవికి  రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లీడర్లకు కష్టాలు మొదలయ్యాయి. కొత్త ప్రెసిడెంట్ ఎవరో తెలియని పరిస్థితి. ఎవరి ఫొటో పెట్టుకుని రాబోయో రోజుల్లో జనం దగ్గరకు వెళ్లి ఓట్లు అడగాలో తెలియక కాంగ్రెస్ పార్టీ లీడర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కష్టాలు చాలవన్నట్లు  పార్టీకి  పైసల కష్టాలు కూడా తోడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కి అనుబంధ విభాగాలున్నాయి. కాంగ్రెస్ సేవాదళ్, ఎన్ ఎస్ యూ ఐ, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ వీటిలో కొన్ని. గతంలో  ఈ విభాగాలకు నెల తిరిగేసరికల్లా బడ్జెట్ ప్రకారం అందాల్సిన సొమ్ములు అందేవి. ఇప్పుడు సీన్ మారింది. సేవా దళ్ కు పాత రోజుల్లో నెలకు రెండున్నర లక్షల రూపాయలు పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చేవి. ఇప్పుడు  అంత సొమ్ము పార్టీ దగ్గర లేదు. దీంతో  సేవాదళ్ బడ్జెట్ ను రెండు లక్షలకు కుదించివేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క సేవాదళ్ పరిస్థితే కాదు మిగతా అనుబంధ విభాగాల కు సొమ్ములు పంపించడానికి కూడా  కాంగ్రెస్ హై కమాండ్ ముందూ వెనకా ఆడుతోంది. కార్యక్రమాల సంగతి తర్వాత ముందు నెలవారీ ఖర్చులను తగ్గించుకోవాలంటూ పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి సిగ్నల్స్ వెళ్లాయి. అంతే కాదు పార్టీలో వివిధ స్థాయిల్లో  పనిచేసే లీడర్లు, కార్యకర్తలకు నెల తిరిగేసరికల్లా అందాల్సిన జీతాలు అందడం లేదు. రెండు నెలల నుంచి ఈ పరిస్థితి నడుస్తోందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల టాక్.

సోషల్ మీడియా టీం రాజీనామా

పైసలు లేని పరిస్థితి ప్రభావం కాంగ్రెస్ పార్టీపై  తీవ్రంగా పడింది. సోషల్ మీడియా టీంలోని  ఇరవై మంది ప్రొఫెషనల్స్  రాజీనామాలు చేసి వెళ్లిపోయారు. దీంతో సోషల్ మీడియా టీంలో ప్రస్తుతానికి కేవలం 35 మంది మిగిలారు. వీళ్లకు కూడా కరెక్ట్ గా జీతాలు అందుతాయన్న గ్యారంటీ లేదు. ఫస్ట్ కు కాకున్నా నెలలో ఏదో ఒక రోజు జీతం వస్తుందన్న ఆశతో వీళ్లింకా  ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసింది. ఈ పరిస్థితి ఒక్క సోషల్ మీడియాదే కాదు. పార్టీ మీడియా టీం ది కూడా ఇదే పరిస్థితి. ఏదేమైనా పార్టీకి చెందిన వివిధ అనుబంధ విభాగాలకు డబ్బులు అడ్జస్ట్ చేయడానికి కాంగ్రెస్ కోశాధికారి అహ్మద్ పటేల్ నానా ఇబ్బందులు పడుతున్నారు.