- మిడ్‌మానేరు ముంపు గ్రామాల్లో ఉపాధి కల్పనకు ప్రతిపాదనలు
- కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు సర్కార్యోచన
- ఇతర సమస్యలపై రివ్యూ చేసిన విప్ఆది శ్రీనివాస్
రాజన్నసిరిసిల్ల,వెలుగు: రాజరాజేశ్వర ప్రాజెక్ట్ లో సర్వం కోల్పోయిన నిర్వాసితుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. మిడ్ మానేరులో మునిగిన 12 గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కుటీర పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలు రెడీ చేయాలని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ఇటీవల అధికారులను ఆదేశించారు.
త్యాగాలను మరిచిన గత సర్కార్
రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మన్వాడ వద్ద 2006లో 25.6 టీఎంసీల సామర్థ్యంతో 2.32లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు మిడ్ మానేరు ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేయగా.. 2019లో పూర్తి అయింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో సర్వం కోల్పోయిన 12 గ్రామాల ప్రజలకు నేటికీ న్యాయం జరగలేదు. ఉన్న ఊరు, భూములను త్యాగం చేస్తే తమను గత బీఆర్ఎస్సర్కార్పట్టించుకోలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముంపు ప్రజల సమస్యలపై గతంలో కాంగ్రెస్లీడర్లు పోరాటం చేశారు. స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో నిర్వాసితులతో నిరసనల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రస్తుత ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్ పోరాటం చేశారు. అప్పుడు పోరాడిన నాయకులే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని తమ సమస్యలు తీరుతాయని ముంపు గ్రామాలు ఆశతో ఉన్నారు.
కుటీర పరిశ్రమలతో ఉపాధి
మిడ్ మానేరు ముంపు గ్రామాల్లో కుటీర పరిశ్రలను నెలకొల్పి, ఉపాధి కల్పించేందుకు ప్లాన్ చేయాలని ఆది శ్రీనివాస్ ఆదేశించారు. నాలుగు రోజుల కింద ఆయన జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముంపు గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, ప్రాజెక్ట్‌కోసం త్యాగాలు చేసినవారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని భరోసా కల్పించారు.
హామీలు నిలబెట్టుకోని బీఆర్ఎస్ సర్కార్
మిడ్ మానేరు రిజర్వాయర్‌లో నీలోజిపల్లి, శాభాష్ పల్లి, అనుపురం, రుద్రవరం, కొడిముంజ, చీర్లవంచ, చింతల్ ఠాణా, గుర్రవాణిపల్లె, ఆరెపల్లి, సంకెపల్లి, కొదురుపాక, వరదవెల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో 12,761కుటుంబాలకు గత ప్రభుత్వం ఆర్అండ్ఆర్కాలనీలు ఏర్పాటు చేసి ఒక్కో కుటుంబానికి 242 గజాల చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఈ జాగాల్లో నిర్వాసితులు తమ సొంత డబ్బుతో ఇండ్లు నిర్మించుకున్నారు.
అయితే ఆ ఇండ్ల నిర్మాణాలకు ఒక్కోదానికి రూ.5.04లక్షలు ఇస్తామని అప్పటి సీఎం కేసీఆర్ 2015లో హామీ ఇచ్చారు. 2016లో మిడ్ మానేరు కరకట్ట తెగినప్పుడు కూడా పరిశీలనకు వచ్చిన కేసీఆర్ ముంపు గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన యువతకు రూ.2లక్షల ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. అప్పట్లో ఆఫీసర్లు సర్వే చేసి 12 గ్రామాల్లో 4వేల అర్హులున్నట్లు గుర్తించారు. వీరిలో కేవలం 2వేల మందికి మాత్రమే ప్యాకేజీ ఇచ్చారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ముంపు గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. ముంపు గ్రామాల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించాం. ఈ విషయంలో ఆయన సానుకూలంగా ఉన్నారు. మిడ్ మానేరులో మునిగిన 12 గ్రామాల నిర్వాసితుల ఉపాధి కోసం కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. దీనికోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
- ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్