- స్టూడెంట్ యూనియన్, ఎమ్మెల్సీగా సేవలు
- ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు
- సంతాపం ప్రకటించిన స్పీకర్ ప్రసాద్, సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఇంద్రసేనా రెడ్డి (81) అనారోగ్యంతో సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆదివారం కన్నుమూశారు. ఆయన కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, మాజీ సీఎం చెన్నారెడ్డికి ఇంద్రసేనా రెడ్డి అత్యంత సన్నిహితుడు.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. 1960లో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా, 1972లో ఏపీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. 1975లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, ఉమ్మడి ఏపీ పీసీసీ వైస్ ప్రెసిడెంట్‌గా, మాజీ సీఎం అంజయ్య కేబినెట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సేవలందించారు. శాట్, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేశారు.
సంతాపం ప్రకటించిన కాంగ్రెస్ నేతలు
ఇంద్రసేనా రెడ్డి మృతిపై కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇంద్రసేనా రెడ్డి ఎంతో చురుగ్గా పాల్గొన్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ గుర్తు చేశారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు అని అన్నారు. ప్రజా ప్రతినిధిగా ఇంద్రసేనా రెడ్డి ఎంతో సేవ చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఓ సీనియర్ నేతను కోల్పోయిందని తెలిపారు.
కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో ఇంద్రసేనా రెడ్డి కీలకపాత్ర పోషించారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇంద్రసేనా రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ మంచి నేతను కోల్పోయిందని చెప్పారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావుతో ఇంద్రసేనా రెడ్డి ఎంతో క్లోజ్‌గా ఉండేవారని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. తనతో 50 ఏండ్ల అనుబంధం ఉందని నిరంజన్ చెప్పారు.