
బీసీ కుల గణన అంశంలో నా పాత్ర లేదని.. నాకు ఏ మాత్రం ప్రమేయం లేదన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఎవరో ఏదో మాట్లాడితే నేను ఎందుకు పట్టించుకుంటాను.. ఎలా పడితే అలా గాలి మాటలు మాట్లాడితే కుదరదు అంటూ కామెంట్ చేశారాయన. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన జానారెడ్డి.. తప్పు చేసిన వాడ్ని కూడా క్షమించే గుణం నాది.. నన్ను ఎవరు తిట్టినా నేను పట్టించుకోను అంటూ స్పష్టం చేశారాయన.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఏంటీ.. పెట్టుకోకపోతే నాకేంటి సంబంధం.. ఆయనతో అస్సలు సంబంధమే లేదన్నారు జానారెడ్డి. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. ఎవరైనా అడిగితే సలహాలు మాత్రమే ఇస్తానన్నారు ఈ సీనియర్ నేత.
ALSO READ | హైదరాబాద్ రియల్ ఎస్టేట్: నిషేధిత జాబితాలో ఉన్నా ఉత్తిదే.. ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఏముందంటే..
పరిపాలన చేసే వారు అడిగినా సలహాలు, సూచనలు ఇస్తాను అని.. మా పార్టీ నాయకులు నన్ను విమర్శించినా ఖండించటం లేదన్నారు. అలాగని సమర్థించటం కూడా లేదని.. కారణం ఏంటో వాళ్లనే అడిగి తెలుసుకోండంటూ మీడియాకే సూచించారు జానారెడ్డి. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఏంటీ అనేది ప్రజలే నిర్ణయిస్తారని.. నిర్ణయించటానికి మనం ఎవరు అంటూ చెప్పుకొచ్చాు జానారెడ్డి.