- అభ్యంతరాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని శుక్రవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మర్యాదపూర్వకంగా కలిశారు. అనుచరుడు గంగిరెడ్డి హత్యకు గురవడంతో విషాదంలో ఉన్న జీవన్ రెడ్డిని ఓదార్చి, ఆయనకు పార్టీ తరఫున న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డితో పలు విషయాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మధు యాష్కీ మాట్లాడుతూ.. 40 ఏండ్లుగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు ఎంతో సేవ చేశారని, ఆయన సేవలు పార్టీకి మరింత అవసరమన్నారు. పార్టీ ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరాదని, ఆయనకున్న అభ్యంతరాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.