హైదరాబాద్, వెలుగు: ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజాపాలనను అందిస్తున్న ప్రభుత్వానికి అనవసరంగా అడ్డంకులు సృష్టించొద్దని ప్రతిపక్షాలకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ హితవు పలికారు. తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం వద్దని, బతుకమ్మను ఎవ్వరూ దూరం చేయలేదన్నారు. సెక్రటేరియెట్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహం పరిపూర్ణంగా ఉందని, ఎలాంటి వంక పెట్టే అవకాశం లేనప్పటికీ కొందరు తప్పులు వెతుకుతున్నారని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు.
తెలంగాణ వచ్చేవరకు సమైక్యవాదిగా ఉండి, ఎన్నడూ తెలంగాణ ఊసెత్తని ఎమ్మెల్సీ వాణీదేవి ప్రజాప్రభుత్వం గురించి, తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు పదేండ్లు దోచుకున్న ప్రజాధనాన్ని స్వచ్ఛందంగా రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేసి.. అమరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్చేశారు.
గత పదేండ్లలో జరిగిన అవినీతిపై విచారణను ఎదర్కొవాలి తప్ప ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించొద్దన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు వేల కోట్ల అసలు, వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వం కడుతోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేతలు చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, దానిని ఇలాగే వదిలేస్తే మంచిదని పేర్కొన్నారు.