కేకే ఖాళీ చేసిన సీటు కోసం సీనియర్ల లాబీయింగ్

కేకే ఖాళీ చేసిన సీటు కోసం సీనియర్ల లాబీయింగ్
  • ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర కాంగ్రెస్​ నేతల ప్రయత్నాలు
  • రాజ్యసభ సీటు కోసం గట్టి పోటీ

హైదరాబాద్, వెలుగు: ఇటీవల బీఆర్ఎస్ నుంచి  కాంగ్రెస్ లో చేరిన కే కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పోటీపడుతున్నారు. మరో రెండేండ్ల పదవీకాలం ఉండడంతో  పలువురు ఎవరి స్థాయిలో వారు ఢిల్లీ లెవల్ లో లాబీయింగ్​ చేస్తున్నారు. ఖాళీ అయిన ఈ స్థానాన్ని తెలంగాణ నేతలకు ఇస్తారా? లేదంటే, ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు అవకాశం కల్పిస్తారా? అనే విషయంలో క్లారిటీ లేదు.

ఒకవేళ తెలంగాణ నుంచి అవకాశం ఇవ్వాలనుకుంటే తమ పేరును పరిశీలించాలని పలువురు సీనియర్లు ఇప్పటికే ఢిల్లీ పెద్దలను అభ్యర్థిస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న పలువురు నేతలు తమకు ఆ పోస్ట్​ ఇవ్వకుంటే.. రాజ్యసభ సీటైనా ఇవ్వాలని కోరుతున్నారు. వీరితో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు  మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు సైతం ఈ సీటుపై కన్నేశారు. వీరే కాకుండా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షి పేరు కూడా వినిపిస్తోంది.

రాష్ట్రం నుంచి  పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ లో చేరి ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఏపీ జితేందర్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, కాంగ్రెస్ దళిత నేత అద్దంకి దయాకర్, ఏఐసీసీ ఎస్టీ సెల్ నేత బెల్లయ్య నాయక్, తదితరులు రాజ్యసభ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఢిల్లీ పెద్దల ఆలోచన మాత్రం ఇంకో రకంగా ఉందనే ప్రచారం పీసీసీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న మాజీ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి ఈ సీటును ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.