చండీఘర్: హర్యానాలో ఖచ్చితంగా గెలుస్తోందనుకున్న కాంగ్రెస్.. తీరా విజయం ముంగిట బోల్తా పడింది. హర్యానాలో హస్తం పార్టీ గెలిచి అధికారం చేపడుతోందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఈ క్రమంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. హర్యానాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) హ్యాక్ అయ్యాయని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ఇవాళ (అక్టోబర్ 9) కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ.. హర్యానాలో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని.. దీనిపై ఈసీకి కంప్లైంట్ చేశామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 20 స్థానాల్లో హ్యాకింగ్ జరిగిందని, అందులో ఏడు స్థానాలకు సంబంధించి డాక్యుమెంటరీ ఆధారాలు ఈసీకి సమర్పించామని తెలిపారు.కర్నాల్, దబ్వాలి, రెవారీ, పానిపట్ సిటీ, హోడల్, కల్కా, నార్నాల్ నియోజకవర్గాల్లో హ్యాకింగ్ జరిగిందని అన్నారు.
ALSO READ | ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది: కాంగ్రెస్
మిగిలిన 13 స్థానాలకు సంబంధించిన పత్రాలను రెండు రోజుల్లో ఈసీకి అందజేస్తామని పేర్కొన్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో.. డౌట్ ఉన్న ఈవీఎంలను పరిశీలించే వరకు వాటిని సీల్ చేసి భద్రపరచాలని ఈసీకి విజ్ఞప్తి చేశామన్నారు. కాగా, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతోందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తారుమారై.. ముచ్చటగా మూడోసారి హర్యానా గడ్డపై బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది.