గుజరాతీలు దేశాన్ని లూటీ చేస్తున్నారు : లాల్జీ దేశాయ్ ఫైర్

గుజరాతీలు దేశాన్ని లూటీ చేస్తున్నారు :  లాల్జీ దేశాయ్ ఫైర్
  • మోదీ, అమిత్ షాపై కాంగ్రెస్ నేత లాల్జీ దేశాయ్ ఫైర్
  • సేవాదళ్​ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్, మున్షీ

హైదరాబాద్, వెలుగు: గుజరాతీలు దేశాన్ని లూటీ చేస్తున్నారని కాంగ్రెస్ సేవాదళ్ జాతీయ అధ్యక్షుడు లాల్జీ దేశాయ్ ధ్వజమెత్తారు.  ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్  షా దేశానికి పట్టిన శని అని మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ సేవాదళ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి లాల్జీ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మోదీ, అమిత్ షాలను గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. రాహుల్ ప్రధాని అయ్యేవరకు ప్రతి సేవాదల్ కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ లో మంచి నాయకులను సేవాదళ్ తయారు చేసిందన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..పదేండ్లల్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేయలేని పనులను... కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోపే చేసి చూపించిందని చెప్పారు. రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ కింద రూ.18 వేల కోట్లు వారి ఖాతాలో వేశామన్నారు. 50 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పాలకులదని చెప్పారు. 

చరిత్రను  బీజేపీ  వక్రీకరించి అబద్ధాలు ప్రచారం చేసి రాజకీయంగా కుట్రలు చేస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు  పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షి మాట్లాడుతూ..కాంగ్రెస్ లో సేవాదళ్ కీలకమైన విభాగం అని, ఇందులో పనిచేసే వారికి ప్రత్యేక గౌరవం ఉంటుందన్నారు. నెహ్రూ అధ్యక్షులుగా మొదలైన సేవాదళ్ ప్రస్థానం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్రను పోషించిందన్నారు. రాహుల్ జోడో యాత్రలో సేవాదళ్ సేవలు మరువలేనివని ప్రశంసించారు. మధు యాష్కీ మాట్లాడుతూ..ఆర్ఎస్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవడంలో సేవాదళ్ కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.