వరంగల్, వెలుగు: లిక్కర్ స్కామ్‌లో కచ్చితమైన ఆధారాలు ఉన్నందునే కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవితపై కేసు నమోదు చేశారని స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం హనుమకొండ కాంగ్రెస్ భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో ఇంతమంది ఉంటే కవితపైనే లిక్కర్ కేసు ఎందుకు పెట్టారు. కవిత నిర్దోషైతే, ఆధారాలు లేకుంటే కోర్టు బెయిల్ ఎందుకు ఇవ్వదు. ఒక ఆడపిల్ల అయి ఉండి నీ బిడ్డ లిక్కర్ స్కామ్‌లో ఉంది. సిగ్గుతో తలదించుకో కేసీఆర్.. ”అంటూ మండిపడ్డారు.
ఆడ పిల్లగా లిక్కర్ సక్రమంగా బిజినెస్ చేసిన పర్లేదు కానీ.. లిక్కర్ స్కామ్‌లో ఉండటమే బాలేదన్నారు. కవిత మాట విని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఆగమైండన్నారు. ‘‘కడియం మోసం చేశాడనడానికి కేసీఆర్‍కు సిగ్గు, బుద్ధి ఉండాలి. తెలంగాణ ప్రజలను మోసం చేసిన అసలు మోసగాడు కేసీఆర్. పదేండ్లు తెలంగాణ వనరులను దోచుకుండు. ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరిపై అవినీతి, భూకబ్జా, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి. పని చేయించుకుని నమ్మించి మోసం చేసే వ్యక్తి. కేసీఆర్ కుటుంబానికి హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాలు ఎలా వచ్చాయి” అని కడియం ప్రశ్నించారు.
బీఆర్‌ఎస్ కనుమరుగే..
‘‘మూడు నెలల్లో అద్భుతం జరగబోతుందని కేసీఆర్ అంటున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో ఏ ఒక్కచోట బీఆర్‍ఎస్ గెల్వదు.. కొన్నిచోట్ల మూడో స్థానం.. మరికొన్ని చోట్ల డిపాజిట్లు రాకుండా పార్టీ కనుమరుగు అవుతుంది.. ఇదే జరిగే అద్భుతం’’అని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. కేసీఆర్‍కు వరంగల్ అంటే కోపమని, ఈ గడ్డ మీద పోరాటాలు చేసినోళ్లు, ప్రశ్నించేటోళ్లు ఎక్కువ ఉంటారని, అందుకే ఆయనకు కోపమని చెప్పారు. కాకతీయులు ఇచ్చిన వారసత్వాన్ని కేసీఆర్ ముక్కలు చేసిండని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓరుగల్లు అని గొప్పగా చెప్పుకున్న జిల్లాను ఎవరడిగారని ఆరు ముక్కలు చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‍కు తెరవెనుక సపోర్ట్ చేయడానికే వరంగల్ పార్లమెంట్‌కు సంబంధం లేని వ్యక్తిని పోటీలో పెట్టారని ఆరోపించారు.
బీజేపీ మెప్పు కోసమే కేసీఆర్ డమ్మీ క్యాండేట్లను పెట్టిండు: తీన్మార్ మల్లన్న
కేంద్రంలోని బీజేపీ పెద్దల మెప్పు కోసమే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున డమ్మీ క్యాండిడేట్లను నిలిపారని పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. వరంగల్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‍కు కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ వెంట ఇప్పుడు ఉద్యమకారులు ఎవరూ లేరని, ఒక్కడితో మొదలుపెట్టానని చెప్పిన కేసీఆర్.. ఒక్కడే మిగిలాడాన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందని, బీజేపీకి ఓటు వేస్తే ‘‘వన్ నేషన్.. జీరో ఎలక్షన్”అవుతుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో భాగమైన ఏసీబీ ఎలా పనిచేస్తుందో ఎమ్మెల్సీగా గెలిచే తాను అలా పనిచేస్తానని చెప్పారు.
ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటాలి
తొర్రూరు, వెలుగు: దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, వచ్చే పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తెలిపారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశాన్ని పాలకుర్తి ఎమ్మెల్సీ యశస్వినీ రెడ్డి అధ్యక్షతన నిర్వహించాన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్ల పాలనలో దేశంలో ప్రజాస్వామ్య మనుగడ కోల్పోయిందన్నారు.