రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్​ను గెలిపించాలి

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్​రాజ్

బెల్లంపల్లి, వెలుగు : రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్లు కాపాడేందుకు లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్​రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే గడ్డం వినోద్  నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేతో పాటు సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజార్ వీర్ తో కలిసి ఆయన మాట్లాడారు. దేశ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, ఉద్యోగాల్లో ఉన్న రిజర్వేషన్లను తొలగిస్తామని ప్రకటన చేస్తున్న మోదీకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.

దేశాన్ని పదేళ్లపాటు పాలించిన ప్రధాని మోదీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. ఓటమి భయంతోనే మోదీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓబీసీల అభివృద్ధికి రూ.40 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం పదేళ్లలో రూ.2వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. దేశంలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 40 లక్షల బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు ఇవ్వాల్సి ఉండగా, క్రిమిలేయర్ అంటూ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు.

ఏడాదికి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ కేవలం 20 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి 19.80 కోట్ల మంది నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. కార్పొరేట్ పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు రూ.10 లక్షల కోట్ల బ్యాంక్ రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు.  ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తమ సంఘం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. 

గడ్డం వంశీని గెలిపించాలి

పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండుసార్లు గెలిచి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యాయని తెలిపారు. సమావేశంలో అడ్వకేట్స్ జాక్ స్టేట్ చైర్మన్ నాగుల శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ హాబీబ్ అహ్మద్, బీసీ ఫోరం జిల్లా చైర్మన్ డాక్టర్ నీలకంఠేశ్వరరావు

పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ జి.భీమ్ సేన్, కో కన్వీనర్లు అడ్డూరి వెంకటస్వామి, మాణిక్ డోంగ్రే, మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఎండీ మునీరుద్దీన్, కో–కన్వీనర్ నాగుల శ్రీనివాస్, మైనార్టీ ఫ్రంట్ జేఏసీ డాక్టర్ హబీబ్​ అహ్మద్ పాల్గొన్నారు.