
- సిద్దిపేట, గజ్వేల్‌లో కనిపించని జోష్
- ఆశావహుల్లో ఎవరి దారి వారిదే
- నేతల తీరుపై క్యాడర్ అనుమానాలు
సిద్దిపేట, వెలుగు: నిన్నమొన్నటిదాకా జోష్ మీదున్న సిద్దిపేట, గజ్వేల్ కాంగ్రెస్ నేతలు ఎన్నికలు దగ్గర పడ్తున్న కొద్దీ డీలా పడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఈ రెండు సెగ్మెంట్లలో చాలామంది కాంగ్రెస్ లీడర్లు టికెట్లు ఆశిస్తున్నా ఆ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కనిపించడంలేదు. కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ కు సరికొత్త ఊపు వచ్చింది. రాష్ట్రంలోఉన్న సీనియర్ నేతలంతా అధికారంలోకి వచ్చేది తామేనంటూ దూకుడు ప్రదర్శింస్తోండగా ఇక్కడ మాత్రం లీడర్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న సందేహాలు క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నాయి.
ఎవరికీ వారే..
సిద్దిపేట, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు ఇంతకుముందులాగా ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నారు. దుబ్బాకలో మాత్రం పార్టీ టికెట్ ఆశిస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డి, కత్తి కార్తిక వేర్వేరుగా జోడోయాత్ర పేరిట గ్రామాల్లో జోరుగా తిరుగుతున్నారు. హుస్నాబాద్ టికెట్ ను ఆశిస్తున్న అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా ఇంటింటికీ ప్రవీణన్న పేరిట నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్ నుంచి దాదాపు ఆరుగురు టికెట్ ఆశిస్తున్నారు. కానీ వీరెవరూ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదు. రాష్ట్రస్థాయిలో ఆందోళనలకు పార్టీ పిలుపు ఇచ్చినా తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టికెట్ కోసం ముఖ్యనేతల చుట్టూ తిరగడం తప్ప నియోజకవర్గం మీద దృష్టి పెట్టడంలేదు. ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతను కాంగ్రెస్ అనుకూలంగా మలుచుకునేందుకుగానీ.. పార్టీ ఓటుబ్యాంకును కాపాడుకునేందుకుగానీ కనీస ప్రయత్నాలు చేయడంలేదు. టికెట్ కోరుతున్న నేతల మధ్య ఇప్పటినుంచే పచ్చగడ్డివేస్తే భగ్గుమనేంత వైరం కనిపిస్తోంది. ఆశావహులు ఎవరికివారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ క్యాడర్ కూడా చీలిపోతోంది. ఒకరు నిర్వహించే ప్రోగ్రామ్‌కు మిగిలిన వాళ్లు దూరంగా ఉండడం, ఒకే కార్యక్రమాన్ని పోటాపోటీగా నిర్వహించడం వల్ల కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింటుందని పార్టీ వర్గాలంటున్నాయి.
చేరికలకూ అడ్డంకులు
సిద్దిపేటలో వివిధ పార్టీల నుంచి పలువురు లీడర్లు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు మాజీ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల నేతలు బీఆర్ఎస్లో ఇమడలేక కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నిస్తుంటే.. సిద్దిపేట కాంగ్రెస్ నేతలు పడనివ్వడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాత పరిచయాలతో పీసీసీ స్థాయి నేతల ద్వారా చేరికలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఒక మైనార్టీ లీడర్ స్థానిక నేతల సహకారం లేకనే హైదరాబాద్‌లో కాంగ్రెస్ లో చేరినట్టు చెప్తున్నారు. కొత్తగా చేరాలనుకునే వారికి అడ్డం పడడంవల్ల పార్టీకే నష్టం వస్తుందన్న ఆందోళన కేడర్‌లో కనిపిస్తోంది.
గజ్వేల్‌లోనూ జనానికి దూరం
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పరిస్థితి ఏమంత బాగాలేదు. నియోజకవర్గ నేతలు అడపాదడపా మాత్రమే గ్రామాల్లో తిరుగుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో పార్టీ కార్యక్రమాలు నామమాత్రంగానే నిర్వహిస్తుండడం పట్ల కేడర్‌లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రెండు నెలల కిందట జోరుగా జోడో యాత్ర ప్రారంభించినా ఆ ఊపు క్రమంగా సన్నగిల్లింది. నర్సారెడ్డితో పాటు మరో ఇద్దరు నేతలు గజ్వేల్ టికెట్ ఆశిస్తున్నా ఎవరూ ప్రజల మధ్య ఉండే ప్రయత్నం చేయడంలేదు. గజ్వేల్‌లో భారీ ఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. సీఎం కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ సత్తా చాటేందుకు ప్లాన్ చేసినా కార్యక్రమం నిలిచిపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వారిలో ఉత్తేజాన్ని నింపేందుకు నియోజకవర్గ నేతలు ప్రయత్నించడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.త్వరలో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో ఆశావహులు నిర్లిప్తంగా ఉండడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.