- జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్ సంబంధాలపై చర్చించాలని బీజేపీ పట్టు
- రాజ్యసభ చైర్మన్‌పై ఖర్గే చేసిన కామెంట్లపై ఫైర్
- అదానీతో బీజేపీ రిలేషన్‌పై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్
- రెండు సభలూ పలుసార్లు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం కూడా గందరగోళంగానే నడిచాయి. జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న సంబంధాలపై చర్చించాలని బీజేపీ పట్టుబట్టగా.. అదానీతో బీజేపీకీ ఉన్న రిలేషన్‌పై డిస్కస్ చేయాలని కాంగ్రెస్ సభ్యులు భీష్మించుకున్నారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగా, అధికార, ప్రతిపక్షాల ధోరణితో పలుమార్లు వాయిదా పడ్డాయి. లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన క్షణం నుంచి అధికార, అపొజిషన్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరు వైపులా సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో చైర్మన్ సభను ఒంటి గంట వరకు వాయిదా వేశారు.
ఆ తర్వాత సభ ప్రారంభమైన కొద్దిసేపటికే పరిస్థితి అలాగే ఉండడంతో మరోసారి 2 గంటల వరకు సభ వాయిదా పడింది. కొశ్చన్ అవర్ సమయం పూర్తయిన తర్వాత జీరో అవర్‌లో ప్రతిష్టంభన మొదలైంది. ఎంపీ జ్యోతిమణి మాట్లాడుతూ.. ఓ వ్యాపారవేత్తకు బీజేపీకి లింక్స్ ఉన్నట్టు ఆరోపించారు. అయితే, ఆ బిజినెస్మెన్ పేరును రికార్డుల్లో చేర్చడం లేదని ప్రిసైడింగ్ ఆఫీసర్ జగదాంబికా పాల్ తెలిపారు. అనంతరం కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈ రూల్స్ ప్రతిపక్షాలకేనా? లేదా అధికార పక్షానికి కూడా వర్తిస్తుందా? అని ప్రశ్నించారు.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన పలు వ్యాఖ్యలను సభాపతి రికార్డులనుంచి తొలగించలేదని అన్నారు. బీజేపీ నేత నిశికాంత్ దూబే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌నేతలకు జార్జ్ సోరోస్‌తో లింక్స్ ఉన్నాయని ఆరోపించారు. భారత్‌ను అస్థిరపరిచేందుకు సోరోస్‌తో కలిసి కాంగ్రెస్ పనిచేస్తున్నదని అన్నారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లగా.. చైర్మన్ సభను 2 గంటలకు వాయిదా వేశారు.
అనంతరం సభ ప్రారంభం కాగా, డిజాస్టర్ మేనేజ్మెంట్ (సవరణ) బిల్లు–2024పై చర్చ జరిగింది. ఆ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. ఆ తర్వాత సభను స్పీకర్ శుక్రవారానికి వాయిదా వేశారు. కాగా, రాజ్యాంగ దినోత్సవానికి అమృతోత్సవ సంవత్సరం సందర్భంగా శుక్ర, శనివారం లోక్‌సభ, రాజ్యసభల్లో రాజ్యాంగంపై చర్చ జరగనున్నది. ఈ చర్చలో పాల్గొనాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి.
కేంద్రమంత్రి రిజిజుపై ప్రివిలేజ్ మోషన్
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుపై అపొజిషన్ ఎంపీలు ఫైర్ అయ్యారు. సభకు తాము అనర్హులమంటూ బుధవారం సభలో రిజిజు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఆయనకు వ్యతిరేకంగా టీఎంసీ ఎంపీ సాగరికా ఘోష్ గురువారం ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు. ఈ తీర్మానంపై 60 మంది ఎంపీలు సంతకం చేసినట్టు ఆమె తెలిపారు. సభను సజావుగా నడిపేందుకు రిజిజు కృషిచేయడంలేదని, దానికి బదులుగా ప్రతిపక్షాలను పదేపదే అవమానిస్తున్నారని ఆరోపించారు.
రాజ్యసభలోనూ రసాభాస
రాజ్యసభలోనూ రసాభాస కొనసాగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని దేశం తెలుసుకోవాలని అనుకుంటున్నదని కామెంట్ చేశారు. అలాగే, రాజ్యసభ చైర్మన్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం చర్చ సందర్భంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై నడ్డా మండిపడ్డారు. చైర్మన్ రూలింగ్‌ను ఎవరూ ప్రశ్నించలేమని, అలా చేయడం సభను, చైర్మన్‌ను ధిక్కరించినట్టే అవుతుందని అన్నారు.
‘‘బుధవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాజ్యసభ చైర్మన్‌ను ఖర్గే విమర్శించారు. ఇది అభ్యంతరకరమైనది, ఖండించదగినది” అని పేర్కొన్నారు. కాగా, నడ్డా కామెంట్స్‌పై ఇండియా కూటమి నేతల ఆందోళనలతో సభలో గందరగోళం నెలకొన్నది. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, జేడీఎస్ ఎంపీ దేవెగౌడ మాట్లాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని దేవెగౌడ ఖండించారు. కాగా, పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరకు సభాపతి రాజ్యసభను శుక్రవారానికి వాయిదా వేశారు.