- కంచుకోటలో పాగా వేసేందుకు ప్రణాళిక
- మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థి డిక్లేర్
- ఇతర పార్టీల నుంచి చేరికలపై నజర్
- హైదారాబాద్‌లో హస్తం నేతల స్పెషల్ మీటింగ్
కామారెడ్డి, వెలుగు : జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్‌పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో చేజారిన స్థానాన్ని ఈ సారి ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను డిక్లేర్ చేయగా, అందరికంటే ముందే తొలి జాబితాలోనే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. మాజీ ఎంపీ సురేశ్ శెట్కార్ హస్తం పార్టీ నుంచి పోటీ చేయనుండగా, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ బరిలో నిలువనున్నారు. హైదరాబాద్‌లో సోమవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అభ్యర్థి సురేశ్ శెట్కర్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంత్‌రావు, బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జహీరాబాద్ సెగ్మెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీలో చేరికలపై చర్చించారు.
పెరిగిన బలం
జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలన్నింటీలో బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించగా, తాజా ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ గెలిచాయి. దీంతో కాంగ్రెస్ బలం పుంజుకుంది. ఈ ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 5,49,143 ఓట్లు వచ్చాయి. ఇవి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే 1,21,128 అధికం. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప తేడాతో జహీరాబాద్ స్థానాన్ని చేజార్చుకుంది.
ఈ పార్టీ నుంచి పోటీ చేసిన మదన్‌మోహన్‌రావుకు 4,28,015 ఓట్లు రాగా, కేవలం 6,229 ఓట్ల తేడాతోనే అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ విజయం సాధించారు. గతంలో జహీరాబాద్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లే సాధించాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నారు. స్టేట్‌లో తమ పార్టీ అధికారంలో ఉండడంతో కార్యకర్తలు సైతం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
చేరికలపై ఫోకస్..
ఎంపీ ఎన్నికల దృష్ట్యా ఆయా పార్టీలకు చెందిన లీడర్లను కాంగ్రెస్ చేర్చుకునేందుకు ఆపార్టీ లీడర్లు ఆసక్తి చూపుతున్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే మదన్, జుక్కల్ లో ఎమ్మెల్యే లక్ష్మీకాంత్‌రావు, బాన్సువాడలో నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా చేరికలు జరుగుతున్నాయి.
ఆయా మండలాల్లోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు దాదాపు పార్టీలు మారారు. దీంతో బీఆర్ఎస్ ఖాళీ అయ్యింది. నామినేటెట్పదవులపై ఆశలు పెట్టుకున్న స్థానిక లీడర్లు ఎంపీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం క్షేత్రస్థాయిలో తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు.