
సూర్యాపేట, వెలుగు: కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీన పడిందని, అందుకే కేటీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నారన్నారు.
కేటీఆర్ సూర్యాపేట పర్యటనలో బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సన్యాసులు, దద్దమ్మలు అనే భాష కేసీఆర్ నుండే వచ్చిందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలకు విసిగిపోయి ప్రజలు బీఆర్ఎస్ కు ఓటుతో బుద్ధి చెప్పారని మండిపడ్డారు.
ప్రజా తీర్పును బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోకుండా ఇంకా అధికారంలో ఉన్నట్లుగా అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని, కేటీఆర్, కవిత, హరీశ్ రావు ఎవరికి వారు తానే కాబోయే సీఎం అని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ ది కాదన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు సార్లు ఎంపీగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని వివరించారు. దళిత స్పీకర్ ను ఏకవచనం తో సంభోదించడం జగదీశ్ రెడ్డి అహంకారానికి నిదర్శనమన్నారు. ఇకనైనా కేటీఆర్ మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటే బాగుంటుందని హితవు పలికారు. సమావేశంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్, నాయకులు అబ్దుల్ రహీం, ఆయుభ్ ఖాన్, రెబల్ శ్రీను, నాగుల వాసు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.