ప్రమాదంలో ప్రతిపక్షం

ప్రమాదంలో ప్రతిపక్షం

ప్రజాస్వామ్య సౌధానికి ప్రతిపక్షం మూలస్తంభం. కానీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షం ఉనికిలోనే లేకుండా పోయే పరిస్థితి త్వరలో తలెత్తేలా కనిపిస్తున్నది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ నుంచి వలసలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యేలు రోజుకొకరు అన్నట్టుగా టీఆర్‌ఎస్‌ బాటపడుతున్నారు. కాంగ్రెస్ ను వీడుతున్నట్టు తాజాగా ఆ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ చేసిన ప్రకటనతో వారి సంఖ్య 10కి చేరింది . ఇంకో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడితే సీఎల్పీ హోదా కూడా పోయేలాఉంది. ఇటీవల శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది . సీఎల్పీని టీఆర్‌ఎస్ లో విలీనం చేసుకోవడంతో మండలిలో ప్రతిపక్షమే లేకుండా పోయింది . తాజాగా గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ నేత జీవన్ రెడ్డి ఘనవిజయంతో మండలిలో విపక్షానికి మళ్లీ వాయిస్‌ దక్కినట్టయింది.

అసెంబ్లీలో ఒక శాసనసభా పక్షాన్ని , మరో శాసనసభాపక్షంలో విలీనం చేయాలంటే మూడింటా రెండో వంతుమెజారిటీ ఉండాలి. ఈ లెక్కన 13 మంది కాంగ్రెస్‌ సభ్యులు టీఆర్‌ఎస్ లో చేరితే కాంగ్రెస్ కు అడ్రసు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కూటమిగా పోటీ చేసినందున మిత్రపక్షమైన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ కు తోడైంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు 12మంది (పది శాతం) ఎమ్మెల్యే ల బలం అవసరం. ఈ లెక్కన కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కింది. కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దిరోజుల నుంచే కాంగ్రెస్‌ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే చాలారోజుల వరకు ఇవి ఊహాగానాలుగానే ఉండిపోయాయి.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకుముందు మాత్రం పరిణామాలు వేగంగా మారిపోయాయి. తమకున్నఎమ్మెల్యేల సంఖ్యా బలం రీత్యా కాంగ్రెస్‌ ఒక ఎమ్మెల్సీ సీటు దక్కుతుందని భావించింది. గూడూరు నారాయణరెడ్డిని బరిలోకి దింపింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ చక్రం తిప్పింది. అన్ని స్థానాలు తమకే దక్కేలా వ్యూహం రచించింది. ఆపరేషన్‌ ఆకర్ష్ ను ప్రయోగించింది. దాంతో ఒకరొకరుగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లు గులాబీ బాట పట్టడం మొదలుపెట్టారు.

ఆదివాసీ ఎమ్మెల్యే లు రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌)తో మొదలైన ఈ ప్రస్థానం అనంతరం చిరుమర్తి లింగయ్య (నకిరే కల్‌), హరిప్రియ నాయక్‌ (ఇల్లెందు), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం),  సుధీర్ రెడ్డి (ఎల్ బీ నగర్ ),  ఉపేం దర్‌ రెడ్డి(పాలేరు),  వనమా వెం కటేశ్వర్ రావు (కొత్తగూడెం), బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్‌) వరకు కొనసాగింది. తాజాగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ప్రకటనతో ఈ సంఖ్య 10కి చేరింది. దాంతో 9 మంది సభ్యులున్న కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా గల్లంతైంది.అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారికంగా టీఆర్‌ఎస్ లో చేరనందున కాంగ్రెస్ కు సాంకేతికంగా సీఎల్పీ హోదా కొనసాగుతోంది.

లోక్ సభ ఎన్ని కల పోలింగ్ కు ముందే..!
రాజ్యాంగ నియమాల ప్రకారం ఒక పార్టీ సభ్యుల్లోని మూడింట రెండో వంతు సభ్యులు తాము వేరే పార్టీలోవిలీనం అవుతామని అంగీకార పత్రం ఇస్తే విలీనంజరుగుతుంది. సాంకేతికంగా ఇందులో అనేకఅంశాలు ఇమిడి ఉన్నప్పటికీ గత అనుభవాలనుబట్టి చూస్తే సాధ్యమేనని రాజకీయ పరిశీలకులుఅంచనా వేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలకమైన పదవులు నిర్వహించిన ఇద్దరు ఎమ్మెల్యేలతోపాటు, ఓ గిరిజన ఎమ్యెల్యే కొద్దిరోజుల్లోనే ‘కారె’క్కుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదేజరిగితే శాసనసభలో కాం గ్రెస్‌ అడ్రస్‌ గల్లంతయ్యే పరిస్థితి తలెత్తుతుంది. లోక్​సభ ఎన్నికల పోలింగ్ కు ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

జీవన్ రెడ్డితో మండలిలో వాయిస్
ఇటీవల కాం గ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌ ఎల్పీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో మండలిలో ప్రతిపక్షం లేకుండా పోయింది. తాజాగా గ్రాడ్యుయేట్స్‌ స్థానం నుంచి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొం దడంతో కాంగ్రెస్ కు పునరుజ్జీవనం మొదలైనట్లయింది.