కాశ్మీర్ సమస్యను ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ సింగిల్ హేండ్‌తో నడిపించింది. తన పలుకుబడితోనే పెత్తనం సాగించింది. దేశ ప్రజలందరూ కాశ్మీరీలకున్న ప్రత్యేక హక్కులు తొలగించి, తమతో సమంగా ట్రీట్ చేయాలని కోరుకుంటున్నా పట్టించుకోలేదు. పార్లమెంట్లో మోడీ సర్కారు ఆకస్మిక నిర్ణయానికి ఎలా స్పందించాలన్న విషయంలోనూ స్పష్టత లేకుండా పోయింది. కాశ్మీర్ గులాం నబీ ఆజాద్ వాదన ఏకపక్షంగా సాగడానికిదే కారణం. కాంగ్రెస్ వైఖరికి సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. ప్రజలకు చేరువ కావడానికి వచ్చిన ఒక మంచి అవకాశాన్ని చేజేతులా వదులుకుందన్న అభిప్రాయం అందరిలోనూ నెలకొంది.
కాశ్మీర్‌కి 50 ఏళ్లుగా ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ 370 రద్దు అంశంపై కాంగ్రెస్ వైఖరి అందరినీ గందరగోళంలో పడేసింది. చారిత్రకమైన తప్పిదం చేసిందంటున్నారు కాశ్మీర్ వ్యవహారాల నిపుణులు. దేశవ్యాప్తంగా ప్రజల మైండ్ సెట్ ఈ విషయంలో స్వాగతించేలా ఉంది. కాంగ్రెస్ మాత్రం వ్యతిరేక భావనతో పొరపాటు చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల ఫీలింగ్స్‌కి అనుగుణంగా మద్దతు పలికితే బావుండేదని ఎనలిస్టులు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి ఇంకా కోలుకోలేదని, ప్రజలకు దగ్గర కావడానికి అంది వచ్చిన ఒక మంచి అవకాశాన్ని చేతులారా వదులుకుందని సమాజంలోని అన్ని వర్గాలు భావిస్తున్నాయి.
ఆజాద్ వెంట నడిచిన కాంగ్రెస్
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ కాశ్మీర్‌కి చెందిన వ్యక్తి. అక్కడి ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎస్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఇలా వ్యతిరేకించడానికి ఆ రెండు ప్రాంతీయ పార్టీలకు కొన్ని లెక్కలున్నాయి. కాశ్మీరీ కాబట్టి గులాం నబీ ఆజాద్ కూడా అక్కడి పార్టీల బాటలోనే నడవటం ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మెజారిటీ సీనియర్ కాంగ్రెస్ లీడర్లు కూడా ఆజాద్‌ని అనుసరించారు. రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్? ప్రజల దృష్టిలో పలచన అవుతామా? అనే ఆలోచన ఎవరూ చేయలేదు. దీంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కి జరగాల్సిన నష్టం జరిగిందంటున్నారు.
ప్రజల ఫీలింగ్స్‌ను పట్టించుకోని కాంగ్రెస్
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్ భువనేశ్వర్ కలితా రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల ఫీలింగ్స్‌కి పూర్తి భిన్న వైఖరి కాంగ్రెస్ తీసుకుందని ఆయన కామెంట్ చేశారు. కాశ్మీర్ వంటి కీలక అంశానికి సంబంధించి కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో ఆ పార్టీ ప్రజలకు ఇంకా దూరమవుతుందన్నారు. సాక్షాత్తూ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేయాల్సిన పదవిలో ఉన్న వ్యక్తే మోడీ సర్కార్ నిర్ణయానికి మద్దతుగా చీఫ్ పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లీడర్లు ఆశ్చర్యపోయారు.
మొత్తంగా విశ్లేషిస్తే… కాంగ్రెస్ పార్టీలో లీడర్‌షిప్‌పై జరుగుతున్న చర్చను కాశ్మీర్ ఇష్యూ పక్కకు లాగింది. ఇప్పుడందరి దృష్టీ జమ్మూ కాశ్మీర్లో తమ పొజిషన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న అంశంపైనే పడింది. కాంగ్రెస్‌కూడా ఆ కోణంలోనే కాశ్మీర్లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలకు అనుగుణంగా స్పందించినట్లు తెలుస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కారు ఆవగింజంత సమాచారాన్నయినా బయటకు పొక్కకుండా మొత్తం టాస్క్‌ని సీక్రెట్‌గా నడిపించేసిందన్నది వాస్తవం. జాతీయ పార్టీగా కాంగ్రెస్‌కి సైతం కనీసం అనుమానం రాకుండా మోడీ–షా జోడీ ప్రవర్తించింది. దీనివల్లనే అనుకోకుండా ఎదురైన ‘ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం’పై ఎలా స్పందించాలన్నదీ కాంగ్రెస్‌కి అంతుబట్ట లేదని అంటున్నారు. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టాలన్న ఒకే ఒక్క సింగిల్ లైన్‌తో కాంగ్రెస్ వాదనకు దిగింది. దీనిని మోడీ అండ్ టీమ్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగిందని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఊహించకపోవడమే తప్పిదమా!
కాశ్మీర్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించడంతో ఆ రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయమేదో కేంద్రం తీసుకోబోతుందన్న ఊహాగానాలు కొన్ని రోజులుగా చక్కర్లు కొట్టాయి. ఆర్టికల్ 370ని రద్దు చేయబోతోందన్న వార్తలు సూచనప్రాయంగా వచ్చాయి. కీలకమైన ఈ ఇష్యూపై ఏ వైఖరి తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్లు తర్జనభర్జనలు పడ్డట్టు పొలిటికల్ సర్కిల్స్ టాక్. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సమర్థించాలని కొంతమంది నాయకులు ఓపెన్‌గానే సూచించినట్లు తెలిసింది. అయితే దీనిపై మోడీ సర్కారు కొంత సమయం తీసుకుంటుందని, చర్చకు పెడుతుందని భావించారు. కాంగ్రెస్‌వారు ఊహించినట్లుగా అలాంటి తంతు జోలికి పోకుండా గంటల వ్యవధిలో అనుకున్నది ముగించేశారు. ఈ రకంగా కీలకమైన ఆర్టికల్ 370ని రద్దు చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని మంటగలపడమేనన్న వాదన తెర మీదకు వచ్చింది. చివరకు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్న వైఖరిని అప్పటికప్పుడు కాంగ్రెస్ తీసుకున్నట్లు పొలిటికల్ ఎనలిస్టుల కథనం.