మహబూబ్ నగర్, వెలుగు: ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిపక్ష పార్టీలు ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూపై ఉద్యమాలు చేస్తూ నిరుద్యోగులు, యువతకు బాసటగా నిలుస్తున్నాయి. ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలతో వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో రూలింగ్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంపై నజర్ పెట్టాయి.
కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి తెరలేపింది. ఈ ఇష్యూపై నిరుద్యోగులు, యువతకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో నిరుద్యోగ నిరసన దీక్షకు శ్రీకారం చుట్టింది. శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్వహించగా సక్సెస్ అయింది. ఆదివారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ దీక్షకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలోని గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, జడ్చర్ల, పాలమూరు, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మందిని సమీకరించాలని నిర్ణయించారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి ఆ పార్టీ రూట్ మ్యాప్ తయారు చేసింది. సాయంత్రం ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చే యువకులు, నిరుద్యోగులతో మెట్టుగడ్డ నుంచి నిరసన ర్యాలీని ప్రారంభించనుంది. అక్కడి నుంచి న్యూటౌన్, కొత్తబస్టాండ్, అశోక్ టాకీస్ మీదుగా క్లాక్ టవర్ కు చేరుకోనుంది. అక్కడే కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. చిన్నారెడ్డి, మల్లురవి, నాగం జనార్దన్ రెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్ రెడ్డి, సంజీవ్ ముదిరాజ్, వంశీచంద్ రెడ్డి, వంశీకృష్ణ, ఎస్ఎ సంపత్ కుమార్ పాల్గొననున్నారు.
పాలమూరుపై రేవంత్ దృష్టి..
సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా పై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక్కడి 14 నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో మెజార్టీ సీట్లను సాధించేందుకు ఏడాదిన్నరగా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద ‘నిరుద్యోగ జంగ్ సైరన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి లక్ష మంది వరకు పబ్లిక్ అటెండ్ కావడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది. గతేడాది కొల్లాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ‘భారత్ జోడోయాత్ర’ ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చింది. జిల్లాలో సాగిన యాత్రలో రాహుల్ గాంధీ ఇక్కడి ప్రజల సమస్యలు వింటూ ముందుకు సాగారు. నాలుగు నెలల కింద బిజినేపల్లిలో దళిత ఆత్మగౌరవ సభ నిర్వహించారు. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పై నిరుద్యోగులు యువతకు అండగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంగా ‘నిరుద్యోగ నిరసన దీక్ష’కు సిద్ధం అవుతుండడం ఆయనకు ఉమ్మడి జిల్లాపై ఉన్న ఇంట్రస్ట్‌ను స్పష్టం చేస్తోంది.
యూత్ ఓట్లే టార్గెట్ గా..
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 28.16 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 1.38 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. వీరు కాకుండా అదనంగా 30 వేల మంది ఇటీవల కొత్తగా ఓటు హక్కు పొందారు. మహబూబ్‌నగర్‌లో 1,772, దేవరకద్రలో 1,932, జడ్చర్లలో 1,619, నారాయణపేట 3,042 మక్తల్ 2,445, అచ్చంపేట 1,603, కొల్లాపూర్ 1,350, నాగర్ కర్నూల్ లో 1,200, వనపర్తిలో 4,104, గద్వాల్ లో 3,351, అలంపూర్ లో 4,237, కల్వకుర్తిలో 1,658 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని అపోజిషన్ పార్టీలు ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నాయి. ఈ క్రమంలో యూత్ ఓటర్లను ఆకట్టుకుని వారి ఓట్లను తమ వైపునకు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.