వన మహోత్సవాన్ని ప్రారంభించింది కాంగ్రెస్సే : మంత్రి కొండా సురేఖ

వన మహోత్సవాన్ని ప్రారంభించింది కాంగ్రెస్సే :  మంత్రి  కొండా సురేఖ

సత్తుపల్లి/పెనుబల్లి, వెలుగు :  వన మహోత్సవ కార్యక్రమాన్ని 1950లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు కేంద్ర మంత్రి కే.ఎం మున్షీ నాంది పలికారని, నేటికి 75 ఏండ్లు నిండి స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నామని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జె.వి.ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, రాష్ట్రంలో 14 వేల నర్సరీల్లో 22 కోట్ల మొక్కలు పెంచి నాటేందుకు సిద్ధం చేశామన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఒక్కో వ్యక్తి ఐదు నుంచి 10 మొక్కలు పెంచాలన్నారు. అంతకుముందు పెనుబల్లి మండలం లంకపల్లి అటవీ ప్రాంతంలో 33,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు అటవీశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్, ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయి, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్, సీపీ సునీల్ దత్, కొత్తగూడెం సర్కిల్ సి.సి.ఎఫ్ డి. భీమా నాయక్, డి.ఎఫ్.ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అడిషనల్​కలెక్టర్లు మధుసూదన్ నాయక్, సన్యాసయ్య, జడ్పీ సీఈవో ఎస్.వినోద్, డీపీవో హరికిషన్, బెటాలియన్ కమాండెంట్ వెంకటరాములు, ఆర్డీవో రాజేందర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మహేశ్, సుజలరాణి, ప్రజా కవి జయరాజ్, మువ్వ విజయ బాబు, కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ పాల్గొన్నారు.