మోదీవి కక్ష సాధింపు రాజకీయాలు:మీనాక్షి నటరాజన్

మోదీవి కక్ష సాధింపు రాజకీయాలు:మీనాక్షి నటరాజన్
  • రాహుల్ సవాల్​కు భయపడ్డారు: మీనాక్షి నటరాజన్
  • గుజరాత్​లో ఓడిస్తామన్న తర్వాతే వేధింపులు
  • కుంభ మేళాలో కుల వివక్ష కనిపించిందని ఫైర్
  • గాంధీ ఫ్యామిలీకి దేశ ప్రజలు అండగా ఉన్నరు: భట్టి
  • రాహుల్​కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నరు: మహేశ్ గౌడ్
  • ఈడీ ఆఫీస్ ముందు మంత్రులు, కాంగ్రెస్ నేతల ధర్నా

హైదరాబాద్, వెలుగు: మోదీ సర్కార్ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన చార్జ్​షీట్​లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టేందుకు వస్తున్నామని పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి సవాల్ విసిరారని గుర్తు చేశారు. అప్పటి నుంచే సోనియా, రాహుల్​కు ఈడీతో నోటీసులు జారీ చేయిస్తూ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు.

 ఈడీ తీరుకు నిరసనగా గురువారం హైదరాబాద్​లోని ఈడీ ఆఫీస్ ముందు పీసీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. ‘‘దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. భవిష్యత్ తరాలకు మంచి జరుగుతుందో.. లేదో.. అనే భయం దేశ ప్రజల్లో కనిపిస్తున్నది. కుంభ మేళా సందర్భంలో కుల వివక్ష చూపించారు. 

పేద ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలబడిన ప్రతిసారీ సోనియా, రాహుల్ ను మోదీ సర్కార్ ఈడీ కేసులతో వేధిస్తున్నది. దేశవ్యాప్తంగా కులగణన, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని రాహుల్ కోరుకుంటున్నారు’’అని మీనాక్షి నటరాజన్ అన్నారు. దేశంలో సమానత్వం, సామాజిక న్యాయం అందించేందుకు కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ‘‘నేషనల్ హెరాల్డ్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ. 

అవినీతి లావాదేవీలు జరపలేదు. కానీ.. ఈడీ మాత్రం మనీ లాండరింగ్ కేసు పెట్టింది. ట్రంప్ టారిఫ్ నిర్ణయాలపై మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మోదీకి ట్రంప్ ఫ్రెండే కదా.. ట్రంప్ నిర్ణయాలతో దేశానికి నష్టం జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు?’’అని మీనాక్షి నటరాజన్ అన్నారు. 

కుల గణనను అడ్డుకునేందుకే అక్రమ కేసులు: భట్టి

దేశంలో కుల గణనను అడ్డుకోవడానికే సోనియా, రాహుల్ పై ఈడీతో అక్రమ కేసులు పెట్టించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాహుల్ ని చూసి ప్రధాని మోదీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలు కాదు.. బ్యాలెట్ పేపర్ కావాలన్న ఏఐసీసీ ప్లీనరీ నిర్ణయంతో కూడా బీజేపీ భయపడుతున్నదని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలే కాంగ్రెస్ ను గెలిపించుకుంటారని అన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబానికి దేశ ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు.

గాంధీ కుటుంబం కేసులకు భయపడదు: మహేశ్ గౌడ్

దేశవ్యాప్తంగా బీజేపీ ఫాసిస్టు పాలన సాగిస్తున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ‘‘రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక మోదీ సర్కార్ అక్రమ కేసుల కుట్రలకు తెరలేపింది. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియాలనే ధర్నా చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పత్రిక అయిన నేషనల్ హెరాల్డ్ కి రూ.90 కోట్ల రుణం ఇస్తే మనీ లాండరింగ్ ఎలా అవుతుంది? రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా, రాహుల్​పై అక్రమ కేసులు పెట్టారు. మోదీ హవా తగ్గుతున్నది. గాంధీ కుటుంబం ఏనాడూ కేసులకు భయపడలేదు. 

రాహుల్ గాంధీ ఒక ఫైటర్. ఆయన దేశ ప్రజల గొంతుక. రాహుల్ సంకల్పం ముందు ఈ కుట్రలు, అక్రమ కేసులు బలాదూర్. బిహార్ ఎన్నికల్లో ఓడిపోతామని భయపడి రాహుల్, సోనియాపై అక్రమ కేసులు పెట్టారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను వాడడం మోదీ, అమిత్ షాకు అలవాటుగా మారింది’’అని అన్నారు. 

ధర్నాకు ముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ నుంచి ఈడీ ఆఫీసు వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహా, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఎంపీ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పార్టీ నేతలు షబ్బీర్ అలీ, మధు యాష్కీ పాల్గొన్నారు.