ఇక్కడ దోచుకుని మహారాష్ట్రలో ఖర్చు పెడుతుండు: మాణిక్ రావ్​ ఠాక్రే

  • కేసీఆర్ పై కాంగ్రెస్ నేత  మాణిక్ రావ్ ఠాక్రే ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు : సీఎం కేసీఆర్ తెలంగాణను దోచుకుని మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణిక్ రావ్​ ఠాక్రే మండిపడ్డారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో పసలేని నేతలే బీఆర్ఎస్​లో చేరుతున్నారని.. దాని వల్ల కాంగ్రెస్​కు నష్టమేమి ఉండదని మాణిక్ రావ్ ఠాక్రే వెల్లడించారు. మహారాష్ట్రకు వెళ్లడం వల్ల కేసీఆర్​కు కొత్తగా ఒరిగేదేమీ లేదన్నారు. కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం నిజమే అయితే విపక్షాల సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్– బీజేపీలు ఒకటేనని ప్రజలు నమ్ముతున్నారని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీకి బీ టీం మాత్రమేనని చెప్పారు. కాంగ్రెస్​లో వైఎస్సార్​టీపీ విలీనంపై తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అది పూర్తిగా అధిష్టానం పరిధిలోని అంశమని మాణిక్ రావ్ ఠాక్రే పేర్కొన్నారు.

ALSOREAD:రూ.295 కోట్ల విలువచేసే డ్రగ్స్ ధ్వంసం