మంచిర్యాల/కోల్ బెల్ట్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీని చూస్తే రాహుల్ గాంధీ భయపడుతున్నారని బీజేపీ తప్పడు ప్రచారం చేస్తోందని, కానీ రాహుల్‌ను చూస్తేనే మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ స్టేట్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మంచిర్యాలలో నిర్వహించిన కారు, బైక్ ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. మంచిర్యాల, నస్పూర్ లో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడారు. ‘‘భారత్ ను ఏకం చేసేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు.
దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు మణిపూర్ నుంచి మహారాష్ర్ట దాకా భారత్ న్యాయ్ యాత్ర చేశారు. పేదలు, మహిళలు, కార్మికులతో పాటు అన్ని వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం” అని దీపాదాస్ మున్షీ అన్నారు. “మోదీ అబద్ధాలకోరు. బీజేపీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. పేదల అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రజలను మోసం చేశారు. ఈసారి ప్రకటించిన మేనిఫెస్టో బీజేపీది కాదు.. అది మోదీ మేనిఫెస్టో. మోదీ గ్యారంటీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు” అని మున్షీ అన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు అవినీతి సర్కార్ ను గద్దె దించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తారన్న
నమ్మకం నాకుంది. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలి” అని ఆమె పిలుపునిచ్చారు.
రాహుల్ ప్రధాని అయితే కొత్త మైన్లు: శ్రీధర్ బాబు
రాహుల్ ప్రధాని అయితే సింగరేణిలో కొత్త మైన్లు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినంక వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశాం. కోడ్ ముగిసిన తర్వాత పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తాం. హరీశ్ రావు తొండి మాటలు చెప్తున్నడు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాడా?’’ అని ఆయన ప్రశ్నించారు.
అదానీ, అంబానీల కోసమే బీజేపీ: వివేక్
కేంద్రంలోని బీజేపీ సర్కారు పేదల సంక్షేమం మరిచి.. అదానీ, అంబానీ వంటి పారిశ్రామికవేత్తల కోసమే పని చేస్తున్నదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీజేపీ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని, సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు. ప్రజలు అవినీతి, నియంతృత్వ సర్కారును ఓడించి బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పారన్నారు. సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేసిందని తెలిపారు.
పరిశ్రమలతో ఉద్యోగాలు కల్పిస్తా: వంశీకృష్ణ
పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే ప్రభుత్వరంగ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ‘‘తెలంగాణ వస్తే బతుకులు బాగుపడుతాయనుకుంటే గత పదేండ్లు దోపిడీ పాలన కొనసాగింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరు చెప్పి కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నాడు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి, నిరుద్యోగం పెరిగి కన్నీటి తెలంగాణగా మారింది” అని అన్నారు. బీఆర్ఎస్ లీడర్లు సింగరేణి ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపించారు.
సింగరేణి సమస్యలు తీరుస్తాం: పీఎస్సార్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో 900 ఉద్యోగాలు ఇచ్చాం. మరో 1,400 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. మెడికల్ అన్ఫిట్ ఉద్యోగాల వయోపరిమితిని 35 నుంచి 40 సంవత్సరాలకు పెంచడం వల్ల 750 మందికి ఉద్యోగాలు వస్తాయి” అని చెప్పారు. సింగరేణిలో పట్టాల సమస్యలు పరిష్కరిస్తామని, రూ.10వేల పెన్షన్ వచ్చే రిటైర్డ్ కార్మికులకు వైట్ రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు.
ఆత్మహత్యలు చేసుకోవద్దు: పొన్నం
నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్ పెండింగ్ పెట్టిన బకాయిలను తాము క్లియర్ చేస్తున్నామని చెప్పారు. జీవో నెంబర్ ఒకటి ద్వారా సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్ లు ఇస్తామన్నారు. సిరిసిల్ల వస్త్రాన్ని మార్కెటింగ్ చేయడానికి హైదరాబాద్ లో ప్రత్యేక సౌలతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సిరిసిల్ల నేతన్నల కోసం కొత్త పాలసీ
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తుందని, కొత్త ఆర్డర్ లు ఇచ్చి నేత కార్మికులకు ఏడాదంతా పని కల్పిస్తుందని కాంగ్రెస్ స్టేట్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ తెలిపారు. ఆమె శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సిరిసిల్లలో పర్యటించారు. సిరిసిల్ల పట్టణంలో, తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ లో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు నేత కార్మికుల కుటుంబాలను పరామర్శించారు.
అనంతరం సిరిసిల్ల డీసీసీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. చేనేత రంగంలో ప్రస్తుత సంక్షోభానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మున్షీ మండిపడ్డారు. ‘‘సిరిసిల్లలో గత 4 నెలల్లో ఐదుగురు కార్మికులు చనిపోవడం బాధాకరం. ఎలక్ష కోడ్ ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్ల కార్మికుల కోసం కొత్త పాలసీ తీసుకొచ్చి ఆదుకుంటుంది. కొత్త పవర్ లూమ్స్ ఏర్పాటు చేయిస్తుంది” అని హామీ ఇచ్చారు.