తిరుమలగిరిలో బీఆర్ఎస్ వర్సెస్ ​కాంగ్రెస్

  • తెలంగాణ చౌరస్తాలో ధర్నాను అడ్డుకున్న కాంగ్రెస్​ కార్యకర్తలు 
  • ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవడంతో గాయాలు 
  • లాఠీచార్జి చేసి చెదరగొట్టిన పోలీసులు 
  • కార్యకర్తలపై కేసులు నమోదు  

సూర్యాపేట/తుంగతుర్తి , వెలుగు : సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఉద్రిక్తత నెల కొంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన పంట రుణమాఫీ అందరికీ అమలు చేయాలని బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ధర్నాను అడ్డుకునేందుకు  కాంగ్రెస్​ కార్యకర్తలు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. తిరుమలగిరి మున్సిపల్ కేంద్రం లోని తెలంగాణ చౌరస్తా ఎదుట గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు షరతులు లేకుండా రుణ మాఫీ చేయాలని డిమాండ్ ​చేస్తూ ధర్నాకు కూర్చున్నారు. 

దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వెళ్లి నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసుల బారికేడ్లు తోసుకుని  రావడానికి యత్నించడంతో నాగారం సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై సురేశ్ ​అడ్డుకున్నారు. అప్పుడే కొంతమంది బీఆర్ఎస్ శిబిరంపైకి రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. పటాకులు కాల్చి మీద వేశారు. రాళ్లదాడి కూడా చేయడంతో రెండు పార్టీలకు చెందిన కొంతమంది   కార్యకర్తలు గాయపడ్డారు. 

ఇదే టైంలో హైదరాబాద్​నుంచి తొర్రూరు వెళ్తున్న రెండు బస్సులకు ప్రమాదం తప్పింది. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి అందరినీ చెదరగొట్టారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు రైతు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్​రెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనపై డీఎస్పీ రవి మాట్లాడుతూ ఇరు పార్టీల కార్యకర్తల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామన్నారు.  

మాజీ మంత్రిని అడ్డుకున్న పోలీసులు.. 

రాళ్ల దాడిలో  గాయపడిన కార్యకర్తలను పరా మర్శించేందుకు తిరుమలగిరి వెళ్తున్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డిని పోలీసులు జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం వద్ద అడ్డుకున్నారు. దీంతో జగదీశ్​రెడ్డి వారితో వాదనకు దిగారు. తాను ఎట్టి పరిస్థితుల్లో తిరుమలగిరి వెళ్లి తీరతానని పట్టుబట్టగా పోలీసులు సర్ది చెప్పడంతో తిరిగి వెళ్లిపోయారు. 

రేవంత్ ​డైరెక్షన్​లోనే దాడులు : జగదీశ్​రెడ్డి  

శాంతియుతంగా ధర్నా చేస్తున్న తిరుమలగిరి బీఆర్ఎస్ శిబిరంపై కాంగ్రెస్ దాడిని ఖండిస్తున్నామని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి  అన్నారు.  రేవంత్ డైరెక్షన్​లోనే  బీఆర్ఎస్ పై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. హామీల అమలులో కాంగ్రెస్​ విఫలమైందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే దాడులు చేస్తున్నారన్నారు. పోలీసులు కాంగ్రెస్​తో కలిసి పనిచేస్తిన్నట్లుగా ఉందన్నారు. తిరుమలగిరి సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. .